అత్యవసర వైద్య సేవలకు ఎయిర్ అంబులెన్స్ !

అత్యవసర వైద్య సేవలకు ఎయిర్ అంబులెన్స్ లను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు అత్యవసర వైద్యసేవలు అందాల్సిన సమయంలో… విపరీతమైన ట్రాఫిక్‌ లో వారిని సరైన 06-10-20141412575862hants_air_ambulanceసమయంలో అస్పత్రికి చేర్చడం కత్తిమీద సాములా అవుతుంది. ఇలాంటి అత్యవసర వైద్యసేవలకు హెలికాప్టర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆసుపత్రుల భవనాలపైన, లేదంటే ఆయా ఆసుపత్రుల సమీపంలోని భవంతులపైన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, నిర్వాహకులు సంబంధిత ఆసుపత్రికి సంబంధించి ప్రతిపాదిత హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసే ప్రాంతం వివరాలను విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ కు అందజేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన కంపెనీలు ప్రామాణిక నిర్వహణ విధానంపై డీజీసీఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. దీంతోపాటు పెద్ద పెద్ద భవనాలపై రూఫ్‌ టాప్‌ హెలిప్యాడ్స్‌ నిర్మాణాన్నీ ప్రోత్సహించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ భావిస్తోంది. వీటిని వాణిజ్య అవసరాలతోపాటు ప్రైవేట్‌ వాడకానికీ అనుమతించాలని నిర్ణయించింది. సంబంధిత దరఖాస్తును డీజీసీఏకు సమర్పించి ఆమోదం పొందాలి. ప్రతి సంస్థ ఒక ఎస్‌వోపీతోపాటు తమ దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. కొండప్రాంతాలతోపాటు సుదూర ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలికాప్టర్లు ఎంతో అనువుగా ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది. అందులో భాగంగా విరివిగా హెలిప్యాడ్‌లకు అనుమతించాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెలికాప్టర్లతో అనుసంధానమైన ప్రాంతాలను గుర్తించాలని పౌరవిమానయాన శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా లేదా ప్రైవేటురంగంలో హెలిప్యాడ్‌లు.. హెలిపోర్టుల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని పౌరవిమానయాన శాఖ సూచించింది. దేశంలో ఉన్న అన్ని హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కేంద్రాల వివరాలను డీజీసీఏ ప్రచురించనుంది. ఇందులో ప్రాంతంతోపాటు హెలిప్యాడ్‌ యాజమాని ఎవరు? అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమిటి? అనే వివరాలు అందుబాటులో ఉంచుతారు. నరేష్‌ చందా కమిటీ సిఫారసులకు అనుగుణంగా హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించి భద్రత, రక్షణ చర్యలను కూడా మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా హెలిప్యాడ్‌లకు అనుమతులు ఇవ్వడం ద్వారా అత్యవసర వైద్యసేవలతోపాటు పర్యాటకరంగానికి కూడా వీటిని విరివిగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో హెలిప్యాడ్‌లు.. హెలిపోర్టులను అనుమతించడం ద్వారా వైద్య, పర్యాటక, వాణిజ్య అవసరాలకూ వీటిని విరివిగా వినియోగించుకోవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది.

Leave a Comment