అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు…

Farmersఖమ్మం : చినుకు కోసం అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. విత్తు అదును దాటుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికీ వర్షం పడకపోవ డంతో జిల్లాలో 36 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి  నెలకొంది. 8 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ పరిస్థితులతో నైరుతి రుతు పవనాల ఆగమనం కోసం అన్నదాతలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

 జిల్లాలో గత నాలుగేళ్లుగా పరిశీలిస్తే జూన్‌లో అతితక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏడాదే. నైరుతి రుతు పవనాలు ఇప్పటికే విజృంభించి వ్యవసాయ పనులు ముమ్మరం కావాలి. ‘ఇదిగో వస్తున్నాయి.. అదిగో తీరం దాటాయి’ అంటూ వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోతోంది.
 
ఓవైపు ఆకాశం మేఘావృతం అవుతున్నా ఎండ వేడిమి మాత్రం తగ్గడం లేదు. దీంతో జిల్లాలో దాదాపుగా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. నైరుతి పవనాల కన్నా ముందే వచ్చే వర్షాలతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకునేవారు. కానీ వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వరుణుడి కరుణ కోసం ఎదురుచూడక తప్పడం లేదు. వర్షాలు అదునుగా పత్తి విత్తనాల సాగు ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యేది. ముందస్తుగా పలకరిస్తాయనుకున్న రుతుపవనాలు వెనక్కు వెళ్లడంతో కాలం అవుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
ఈ నెలలో సగటు సాధారణ వర్ష పాతం 13.2 సెం.మీ. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కురిసింది 1.8 సెం.మీ. మాత్రమే. 8 మండలాల్లో మాత్రం కొంచెం ఎక్కువగా కురిసినప్పటికీ.. అదికూడా సాధారణం కన్నా తక్కువే. ఈ వారం రోజుల్లోనైనా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తేనే పంటలు అదునుగా సాగవుతాయని, చివరి వరకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉంటే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు.

వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాలివే..

జిల్లాలో వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక, గుండాల, మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, సింగరేణి, బయ్యారం, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, తల్లాడ, ఏన్కూరు, కొణిజర్ల, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, చింతకాని, వైరా, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.

ఆయా మండలాల్లో ఈ నెలలో వర్షం పడకపోవడంతో సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత నాలుగేళ్లలో చూస్తే ఈ జూన్‌లోనే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కరువు ఏర్పడుతుందేమోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇల్లెందు, గార్ల, ముల్కలపల్లి, పెనుబల్లి, కల్లూరు, ఖమ్మంఅర్బన్, ముదిగొండ, మధిర మండలాల్లో మాత్రం మిగితా మండలాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా వర్షం పడింది. అయితే అదికూడా సాధారణం కన్నా తక్కువే.
 
ఎండుతున్న నీటి వనరులు..
వర్షాలు లేక చిన్నచిన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం మైళ్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సి వస్తోంది. కాలం ఇలాగే ఉంటే పశువులకు కూడా తాగునీరు దొరకదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Comment