ఆంధ్ర సింగరేణి… చింతలపూడి!

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయిన సింగరేణి బొగ్గు గనుల లోటును చింతలపూడి ప్రాంతం తీర్చనుంది. అత్యంత నాణ్యమైన, అపారమైన నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేలు చెబుతుండటంతో ఈ ప్రాంతం రాష్ట్రం పాలిట వరదాయినిగా మారుతుందని భావిస్తున్నారు. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం చింతలపూడి సబ్-బేసిన్‌లో దాదాపు 1000 నుండి 3000 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. 500 మీటర్ల లోతులో దాదాపు వెయ్యి అడుగుల మందంలో ఈ నల్ల బంగారం నిల్వలున్నట్లు గుర్తించారు. సింగరేణి ప్రాంతంలో లభ్యమయ్యే బొగ్గు కంటే ఇక్కడి బొగ్గు అత్యంత నాణ్యత, అధిక ఉష్ణోగ్రత కలిగివుండటంతో విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందని నిపుణుల నివేదికలు సూచిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం చింతలపూడి సబ్-బేసిన్‌లో లభించే బొగ్గుతో సంవత్సరానికి 8 వేల మెగావాట్ల చొప్పున సుమారు 30 నుండి 60 సంవత్సరాల వరకు విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 6600 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీనిలో సుమారు రెండు వేల మెగావాట్ల లోటు ఉంది. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత ప్రారంభమైతే ఇక రాష్ట్రానికి విద్యుత్ కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవ్వడమేకాక, మిగులు రాష్ట్రంగా అవతరించే అవకాశముంది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం బ్రిటీష్ కాలంలోనే గోదావరి లోయ ప్రాంతంగా ఖమ్మం – పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొంత ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేంద్ర జియోలాజికల్ సంస్థ ఈ ప్రాంతాన్ని విభజించి, చింతలపూడి సబ్-బేసిన్ ప్రాంతంగా గుర్తించిందని తెలుస్తోంది. చింతలపూడి కేంద్ర ప్రాంతంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా వున్నట్లు గతంలోనే కొన్ని సర్వేలు గుర్తించాయి. అయితే వెలికితీతకు అవసరమైనంత నాణ్యత రాలేదని సుమారు పది సంవత్సరాల కిందట చేసిన సర్వేలు సూచించడంతో ఇప్పటి వరకు ఇక్కడి బొగ్గుపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. విభజన నేపథ్యంలో బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. అపార నల్ల బంగారం నిక్షేపాలు చింతలపూడి సబ్ బేసిన్‌లో ఉన్నాయని, ప్రస్తుతం వెలికి తీయవచ్చని జిఎస్‌ఐ నివేదిక సూచించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సమగ్ర సర్వే జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బొగ్గు గనుల తవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పని సరికావడంతో, రాష్ట్ర గనుల శాఖ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి ఫైలు పంపినట్లు తెలుస్తోంది. ఈ సర్వే, కేంద్ర అనుమతి లభించిన తదుపరి ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.

Leave a Comment