ఈసారి తక్కువ మాట్లాడతా!

taapsee ‘‘ముంబయ్‌లో అడుగుపెట్టిన వేళా విశేషం బాగుందో ఏమో.. అక్కడికి అలా వెళ్లానో లేదో ఇలా ఓ సినిమాకు సంతకం చేసేశాను. పైగా, ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. ‘చష్మే బద్దూర్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం అక్కడ ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, ముంబయ్‌కి మకాం మారగానే ఆమె అంగీకరించిన చిత్రం పేరు ‘బేబీ’. అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పోషిస్తున్న పాత్ర గురించి తాప్సీ చెబుతూ – ‘‘హిందీలో మొదటి సినిమా ‘చష్మే బద్దూర్’లో నేను చురుకైన అమ్మాయిలా నటించాను.
 
 రెండో సినిమా ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’లో కూడా దాదాపు నా పాత్ర అలానే ఉంటుంది. ఈ రెండు పాత్రలకు భిన్నమైన పాత్రను ‘బేబీ’లో చేస్తున్నా. ఈ సినిమాలో నా పాత్ర తక్కువ మాట్లాడుతుంది. అలాగే ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తుంది నా శారీరక భాష, హిందీ భాష ఉచ్చారణ అన్నీ విభిన్నంగా ఉంటాయి. ‘బేబీ’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న మర్నాడు ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ షూటింగ్‌లో పాల్గొంటే, ఆ చిత్రదర్శకుడు అమిత్ రాయ్ తెగ కంగారుపడిపోయేవారు. ఎందుకంటే, ఆ షూటింగ్ లొకేషన్లో కూడా ‘బేబీ’కి మాట్లాడిన యాసలోనే మాట్లాడేదాన్ని.
 
 షూటింగ్ విరామంలో సీరియస్‌గా కూర్చునేదాన్ని. దాంతో అమిత్ ‘నువ్వు ఉన్నది రన్నింగ్ షాదీ డాట్‌కామ్’ షూటింగ్’లో అనేవారు. అప్పుడు ఈ సినిమా పాత్రకు తగ్గట్టుగా మారేదాన్ని. ‘బేబీ’ పాత్ర అంతగా నన్ను ప్రభావితం చేసింది. ‘రన్నింగ్…’లో కూడా నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ‘చష్మే బద్దూర్’ తెచ్చిన పేరుని ఈ చిత్రం రెట్టింపు చేస్తే, దీని ద్వారా వచ్చిన పేరు ‘బేబీ’తో రెట్టింపు అవుతుంది’’ అని చెప్పారు.
 

Leave a Comment