ఏటీఎం మాయగాడు

8*సాంకేతిక లోపాన్ని అడ్డుపెట్టుకుని రూ. 1.45 కోట్లు డ్రా
*నకిలీ పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు.. 32 ఏటీఎం కార్డులు
*నిందితుడు ఎల్‌బీనగర్ వాసి
*వెంటాడి పట్టుకున్న గుంతకల్లు పోలీసులు
 గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్: ఏటీఎంలోని సాంకేతిక లోపాన్ని పసిగట్టి, మారుపేర్లతో వివిధ బ్యాంకుల్లో 32 ఏటీఎం కార్డులు సంపాదించి.. రూ.1.45 కోట్లు కొల్లగొట్టిన ఏటీఎం మాయగాడి ఉదంతమిది. ఇతడిని అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌కు చెందిన మనగంటి కార్తీక్ విలాసాలకు బానిసై చోరీల బాటపట్టాడు.

ఈ క్రమంలో ఓ రోజు నంద్యాలలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న ఏటీఎం నుంచి తన ఏటీఎంతో రూ. 10 వేలు డ్రా చేశాడు. అయితే మిషన్ నుంచి డబ్బు వచ్చే లోగా ట్రాన్సాక్షన్‌ను వద్దనుకుని క్యాన్సెల్ బటన్ నొక్కాడు. అయినా ఆశ్చర్యంగా రూ. 10 వేలు బయటకు వచ్చాయి. వెంటనే చెక్ చేసుకోగా కార్తీక్ అకౌంట్‌లో మొత్తం డబ్బు అలాగే ఉంది. దీంతో ఏటీఎంలో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. ప్రతిసారీ డబ్బు డ్రా చేయడం, ఆ వెంటనే క్యాన్సిల్ బటన్ నొక్కడం చేస్తూ నగదు కొల్లగొట్టేవాడు.

ఇలాగైతే పట్టుపడతానని భావించి వివిధ పేర్లతో, నకిలీ గుర్తింపు కార్డులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి 32 ఏటీఎం కార్డులను సంపాదించాడు. రూ. 13 లక్షలతో హుందాయ్ వెర్న కారును కొన్నాడు. నంద్యాల్లోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నగదులో తేడా వస్తుండటంపై బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరాలను పదేపదే పరిశీలించారు.

ఎట్టకేలకు దొంగ ఎవరో తెలుసుకుని.. అతను ఎక్కువగా నగదు డ్రా చేసే ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును అలర్ట్ చేశారు. బుధవారం తెల్లవారు జామున కార్తీక్ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు చెప్పాడు. పసిగట్టిన కార్తీక్ కారులో ఉడాయించాడు. అతడి కారు అనంతపురం వైపు మళ్లడంతో అనంతపురం జిల్లా ఎస్పీకి సమాచారమిచ్చారు.

పోలీసులు వెంటాడుతున్నారని గమనించిన కార్తీక్ గుంతకల్లు సమీపంలో కారాపి పొలాల్లోకి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ వైపు పరుగుదీస్తుండగా గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో కార్తీక్‌ను పట్టుకున్నారు. 32 ఏటీఎం కార్డులు, రూ. 8వేలు, 4 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఓ మహిళ ఉన్నట్లు ఆనవాళ్లను బట్టి కనుక్కున్నారు. ఆమె పరారీలో ఉంది.

Leave a Comment