ఏపీకి ప్రత్యేక హోదా: ‘అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు’

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ అసాధ్యమని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినట్లు రెండు రోజుల క్రితం వార్త కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. వీటిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. విభజన చట్టంలోనూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉందని, దానిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

రఘవీరా ఆరోపణలపే కొద్దిసేపటి క్రితం వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ అసాధ్యమంటూ తానెప్పుడూ వ్యాఖ్యానించలేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్ర పరిశీలనలో ఉందని తెలిపారు. విభజన చట్టంలో ఎలాంటి సవరణ ప్రతిపాదనపైనైనా రెండు రాష్ట్రాలతోనూ, సంబంధిత ప్రజాప్రతినిధులతో మాట్లాడాకే ముందుకెళతామన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడుందో చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు అంశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తామన్న ప్యాకేజీ చట్టంలో లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Leave a Comment