ఏపీకి విదేశీ నిధుల వరద..?

కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు.. పెట్టుబడులవేటపై దృష్టి సారించారు. ఇప్పటికే హీరో వంటి ప్రతిష్టాత్మక సంస్థలను చేజిక్కించుకున్న చంద్రబాబు.. ఆ జోరు కొనసాగించాలని నిర్ణయించారు. మానవ వనరులతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నా.. విదేశీ పెట్టుబడులు రావాలంటే ప్రమోషన్ తప్పక ఉండాలని భావించిన ఏపీ సీఎం అందుకు ఏకంగా ఆయనే రంగంలోకి దిగాలని డిసైడయ్యారు. కొండ మన వద్దకు రాకపోతే.. మనమే కొండ వద్దకు వెళ్లాలన్న పాలసీ అనుసరిస్తున్న చంద్రబాబు విదేశీ పెట్టుబడుల కోసం స్వయంగా ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి రెండు మూడు నెలల వ్యవధిలో ఐదు దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆకర్షించాలని మ్యాప్ గీశారు. ఇప్పటికే సింగపూర్ మాజీ ప్రధాని గో చో టాంగ్ బృందం తో పాటు, మలేషియా పారిశ్రామిక వేత్తల బృందం చంద్రబాబు ను కలిసి తమ తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానం పలికాయి. వీరితో పాటు అనేక పారిశ్రామికవేత్తల సంఘాల నుంచీ బాబుకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి. వీరి కోరిక మేరకు చైనా, సింగపూర్, మలేషియా, జపాన్, కొరియా దేశాల్లో పర్యటించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ దేశాలను ఎంచుకోవడానికి కూడా కారణముంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, విడిభాగాలు, ఆటబొమ్మల పరిశ్రమలు వంటి ఉత్పత్తిలో ఈ దేశాలు ముందంజలో ఉన్నాయి. అందుకే అలాంటి పరిశ్రమలు ఏపీలో పెట్టించేందుకు ప్రయత్నించనున్నారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్నసదుపాయాలు, కేంద్రం నుంచి అనుమతులు తెప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, పన్ను ప్రయోజనాలు వంటి విషయాలను వివరించి వారిని ఆకర్షించాలన్నది బాబు ప్లాన్. ఎవరో అధికారులను పంపించకుండా… స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లే ఉండే ప్రభావం ఎక్కువ ఉంటుందన్నది బాబు ఆలోచన. గతంలో హైదరాబాద్ కు ఐటీ రంగాన్ని తెచ్చే సమయంలోనూ బాబు అమెరికాలోని సిలికాన్ వాలీలో పర్యటించి సక్సస్ అయ్యారు. ఇప్పుడు అదే సీన్ మరోసారి రిపీట్ చేసి ఉత్పత్తి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానంటున్నారు చంద్రబాబు.. డిసెంబర్ నెలలోపు పర్యటనలు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న చంద్రబాబు ఏమేరకు సక్సస్ అవుతారో చూడాలి.

Leave a Comment