ఐటి కంపెనీలలో ఉద్యోగాలకు ఎసరు..!

మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో ఉపాధి అవకాశాలు పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. భారం పెరుగుతోంది.. ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీలంటున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు వేల ఉద్యోగులను రోడ్డున పడేశాయి. కొత్తగా India US Outsourcingఉపాధి అటుంచితే ఉన్న ఉద్యోగాలు కాపాడుకోవడం సవాల్‌గా మారింది. సర్వీస్‌ సెక్టార్‌ మరీ దారుణంగా ఉంది. మేక్‌ ఇన్‌ ఇండియాకు మోడీ కార్పొరేట్‌ దిగ్గజాల సాక్షిగా శ్రీకారం చుట్టారు.

10 ఏళ్లలో 10 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్వేయమన్నారు. పక్షం గడవకముందే పరిస్థితులు తారుమారువుతున్నాయి. కొత్తగా ఉపాధి సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తామని మోడీ అంటున్నారు. సహకరిస్తామని బిల్‌గేట్స్‌ కూడా ఢిల్లీలో హామీ ఇచ్చారు. కానీ అదే కార్పొరేట్‌ పెద్దమనిషి తనకు చెందిన చెన్నైలోని నోకియా మొబైల్‌ హ్యాండ్‌ సెట్‌ యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. స్వచ్చంద పదవీ విరమణ పేరుతో 5వేల 7వందల మంది సిబ్బందిని ఇంటికి పంపించారు. ఇంకా 900 వంది మెడపై కత్తి వేలాడుతోంది. 2006లో ఉత్పత్తి మొదలుపెట్టిన కంపెనీ 8ఏళ్లకే ఉద్యోగులను వదిలించుకుంది. కంప్యూటర్‌ ఆధారిత రంగాల్లోనూ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. యూహూ సంస్థ సంస్థ బెంగళూరు యూనిట్‌లో సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. నష్టాలు సాకుగా చూపుతూ ప్రపంచవ్యాప్తంగా ఖర్చు తగ్గించుకుంటున్న కంపెనీ.. ఇక్కడ కూడా ఉద్యోగులను ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేసింది. బెంగుళూరు యూనిట్‌లో 2వేల మంది ఉద్యోగులున్నాయి. కార్యాలయం ఉంచి సిబ్బందిని నామ మాత్రంగా ఉంచితే చాలని నిర్ణయానికొచ్చింది.

మరో అతిపెద్ద కంప్యూటింగ్‌ సంస్థ హెచ్‌పి కూడా 5వేల మందిపై వేటు వేసింది. ఇందులో భారత్‌లోని సిబ్బంది ఉన్నారు. హెచ్‌పీ సంస్థకు 60శాతం షేర్లున్న భారతీయ కంపెనీ ఎంఫసిస్‌ టెక్నాలజీలో ఉద్యోగులపై వేటుపడనుంది. ఇదే కాదు.. భవిష్యత్తులో భారతీయ ఐటీ కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గించుకోవడానికి ప్రణాళికలేస్తున్నాయి. 2017 నాటికి విప్రోలో పనిచేస్తున్న లక్ష 46వేల మంది సిబ్బందిని లక్షకు కుదించాలని నిర్ణయించింది. ఇతర కంపెనీలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. దేశంలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో సర్వీస్‌ సెక్టార్‌ వాటా 27శాతం. వీరి భవిష్యత్తు ఇప్పుడు అయోమయంగా మారింది. ఏటా కోటి మందికి ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు సర్వీస్‌ రంగంలో పరిణామాలు కలవరపెడుతున్నాయి.

Leave a Comment