ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా సాదిక్….

హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సు ఆ బాలుడిది… పట్టుమని పదేళ్లు కూడా లేవు.  బ్లడ్ క్యాన్సర్ మహమ్మారి అతన్ని వెంటాడుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చివరి కోరిక కూడా తీర్చలేమోనని  ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. బాసటగా నిలిచిన స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ బాలుడు ఒక్క రోజు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించాడు. సిటీలో జరిగిన ఈ యదార్థఘటన వివరాలు మీకోసం…

కారులో పోలీస్ యూనిఫాం వేసుకొని దర్జాగా దిగుతున్న ఈ బాలుడి పేరు సాదిక్. వయస్సు పది సంవత్సరాలు. కారుదిగగానే పోలీసు అధికారులంతా అతడికి సెల్యూట్ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా..? అతడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ఆశ్చర్యంగా ఉందా…? అవును మరీ మీరు విన్నది నిజమే. సిటీకి ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు కూడా స్వీకరించాడు. తన కోరిక తీరిన ఆనందంలో ఉన్న సాదిక్ ఇక కొద్ది రోజులు మాత్రమే బతకగలడు. ఆ చిరుననవ్వులు ఇంకా ఎంతో కాలం ఉండవు. విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనుక మానరు. భయంకరమైన వ్యాధి ఆ బాలుడిని వెంటాడుతోంది.

సాదిక్ తండ్రి రహీముద్దీన్…ట్రాన్స్ పోర్టులో పని చేస్తున్నాడు. వీరిది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామం. స్కూలుకు వెళ్లే సాదిక్ ఓ రోజు అస్వస్థకు గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే సాదిక్ కి బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. అతన్ని చూపించని ఆసుపత్రి లేదు. గత ఐదు నెలలుగా రెడ్ హిల్స్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐనా వ్యాధి రోజురోజుకూ ముదురుతుందే తప్ప తగ్గటం లేదు. చిన్నప్పటి నుంచి తన కొడుకు పోలీస్ కావాలని ఎన్నో కలలు కన్నాడని సాదిక్ తండ్రి కంటతడి పెట్టుకున్నారు.

కొద్ది రోజుల్లో తన కుమారుడు దూరంకాబోతున్నాడన్న బాధ….అతని చివరి కోరికను కూడా తీర్చలేకపోతున్నాననే బాధతో సాదిక్ తండ్రి నిస్సాహాయక స్థితిలో ఉండిపోయాడు. ఇంతలో మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చారు. బాలుడి విషయం తెల్సుకొని డీజీపీ అనురాగ్ శర్మకు, సిటీ సీపీ మహేందర్ రెడ్డికి తెలియజేశారు. దీంతో సాధిక్ కోరిక తీర్చేందుకు ఒక్కరోజు పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. తెలిసీ తెలియని ప్రాయంలో వ్యాధి బారిన పడిన సాదిక్ కు దేడువు మేలు చేయాలని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

సాదిక్  కోరికను తీర్చినట్లే మేక్ ఎ విష్ సంస్థ ఎందరో చిన్నారుల కోరికలను తీర్చింది. ఒకరికి సీఎం కేసీఆర్ ను కలవాలని కోరిక ఉంటే ఆ ముచ్చటను తీర్చింది. మరొకరికొ సచిన్ టెండూల్కర్ ను కలిపారు. అంతేకాదు మరీ ఖమ్మంలో బ్రేన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి పవన్ కళ్యాన్ ని చూడాలనుకుంటోందని…ఖచ్చితంగా ఆ చిన్నారి కోరిక తీర్చుతామంటున్నారు. వారి కోరికను తీర్చే ఆనందంలో వారి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ ప ష్పాజైన్ అంటున్నారు.

పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కానీ చాలా మంది ఆ కోరికలను తీర్చుకోకుండానే మృత్యువాత పడుతున్నారు. అలాంటి చిన్నారుల కోరిక తీర్చేందుకు మేక్ ఎ విష్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. ఇక మన ఒక్క రోజు పోలీస్ కమిషనర్ సాదిక్ ఆరోగ్యం కూడా మెరుగవ్వాలని మనం కోరుకుందాం.

Leave a Comment