ఒక్క పండు.. రెండు కిలోలు!!

mangoవడోదర : అక్కడికెళ్లి కిలో మామిడిపళ్లు కావాలంటే.. ముందు పైకి, కిందకి చూస్తారు. తర్వాత మరీ తప్పదంటే సగం కాయ కోసి ఇస్తారు. అవును, ఎందుకంటే అక్కడ పండే మామిడి పండ్లు ఒక్కొక్కటి రెండేసి కేజీల బరువున్నాయి. మధ్య గుజరాత్లోని రైతులు, శాస్త్రవేత్తలు కలిసి ఈ విజయం సాధించారు. పైపెచ్చు ఇవేమీ జన్యుమార్పిడి చేసి పండించినవి కావు.. అచ్చమైన స్వదేశీ వెరైటీలు.  వడోదర జిల్లాలోని నరమదా నది ఒడ్డున గల షినోర్ గ్రామంలో ఇక్బాల్ ఖోఖర్ అనే రైతు తోటలోని చెట్లకు ఈ పెద్ద పెద్ద మామిడిపండ్లు పండాయి.

ఛోటా ఉదేపూర్లో ఇటీవల జరిగిన కృషి మహోత్సవంలో ఈ మామిడిపండ్లను ప్రదర్శించారు. పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ స్నేహా పటేల్ ఈ పండ్ల గొప్పదనాన్ని గుర్తించి, వీటికి ప్రాచుర్యం తెచ్చారు. రాజాపురి మామిడిపండ్లు సాధారణంగా పెద్దగా ఉంటాయని, కానీ వాటికంటే కూడా ఇవి నాలుగైదు రెట్లు పెద్దగా ఉన్నాయని ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానవన నిపుణుడు హేమంత్ పటేల్ తెలిపారు.

Leave a Comment