హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపధ్యంలో కాబోయే ముఖ్యమంత్రులు తమ ప్రమాణస్వీకారోత్సవానికి ఎవరిని ఆహ్వానించారు అనేదానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కె.చంద్రశేఖర రావు ప్రొఫెసర్ కోదండరామ్‌ను స్వయంగా ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. విజయవాడ,గుంటూరుల మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న విశాలమైన స్థలంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఎవరిని స్వయంగా ఆహ్వానించారో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి,11 రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబు ఆహ్వానించారు. వారికి ఆయన స్వయంగా ఫోన్ చేసి తన ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కె.చంద్రశేఖర రావుకు చంద్రబాబు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని కూడా ఆహ్వనించారు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని పార్టీ నేతలు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు తెలిసింది.
Recent Comments