దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐ గట్టి భద్రత!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఎప్పటికప్పుడు తన స్వామి భక్తిని చాటుకుంటూనే ఉంది. ఎప్పుడైతే తన శత్రువుగా భావిస్తున్న భారత్ కు అతను శత్రువుగా మారాడో, అప్పటి నుంచే అతడు ఆ సంస్థకు అత్యంత విలువైన వ్యక్తిగా మారిపోయాడు. దావూద్ విషయంలో ఐఎస్ఐ ఎవరేమన్నా పట్టించుకునే స్థితిలో లేదు. ఎప్పటికప్పుడు అతడికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్న ఆ సంస్థ, తాజాగా మునుపెన్నడూ లేనిరీతిలో భద్రతను పెంచిందట. అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను తోసిరాజని, అతడు కోరిన కోర్కెలన్నింటినీ తీరుస్తూ తరిస్తోందని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అప్పటిదాకా దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన దావూద్, బొంబాయి బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఒక్కసారిగా ఐఎస్ఐకి కీలక భాగస్వామిగా మారాడు. అప్పటి నుంచి కరాచీలోనే మకాం వేసిన దావూద్, ఎప్పడు బయటికెళ్లినా, ఐఎస్ఐ అతడి వెన్నంటే ఉంటోంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రక్షించుకోలేకపోయిన ఐఎస్ఐ, దావూద్ పై ఈగ వాలితే కూడా సహించడం లేదు. ఐఎస్ఐలో పదవీ విరమణ పొందిన సీనియర్ అధికారులను దావూద్ కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా పనిచేసేందుకు అనుతిస్తున్న ఐఎస్ఐ, అతడికి భారత్ నుంచి నకిలీ పాస్ పోర్టులను అందించే పనిని కూడా చేసి పెట్టింది.

Leave a Comment