దేశం సీమాంధ్ర సినిమా చూస్తోంది…

అహ్మదాబాద్ నుండీ జైపూర్ వెళ్లే రైల్ లో ఒక యువకుడు మధ్య బెర్త్ మీద పడుకుని స్మార్ట్ ఫోన్ లో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” చిత్ర హిందీ అనువాదాన్ని చూస్తున్నాడు! జైపూర్ వెళ్ళి మేము బస చేసిన హోటల్లో వెయిటర్స్ “దువ్వాడ జగన్నాధం” చిత్రం అనువాదాన్ని ఆసక్తిగా చూస్తూ కనిపించారు!

చూడబోతే, భారతదేశం అంతటా “ఆంధ్ర చలనచిత్ర రంగం” వినోదాన్ని అందించే అతిపెద్ద వనరుగా మారిపోయినట్లు కనిపిస్తోంది!

“స్టార్ జల్సా” చానల్ ని రెండు రోజులపాటు వీక్షిస్తే, ఈ విషయంలో మీ సందేహాలు అన్నీ నివృత్తి అయిపోతాయి. విజయవంతమైన ప్రతి ఆంధ్ర సినిమా నుండి ఒక మోస్తరు వసూళ్లు రాబట్టిన మన స్థానిక చిత్రాలు అన్నీ మక్కీకి మక్కీ బంగ్లా భాషలో పునర్నిర్మితమయ్యి బెంగాలీ తెర మీదకి వరదలా ప్రవహిస్తున్నాయి!

2000 సం. నుండీ చూస్తే ఒక్కడు, మన్మధుడు, జల్సా, పోకిరి, బొమ్మరిల్లు, ఆర్య, ఆనంద్, అరుంధతి, ఒక్కడు వంటి సాంఘీక  నేపధ్య కధలతో పాటు మగధీర, ఈగ తరహా ప్రయోగాత్మక చిత్రాలు తమిళ చిత్రాలని తెలుగులో పునర్నిర్మించే మూస ధోరణిని మూలకు నెట్టాయి. త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల, విజయ భాస్కర్, పూరీ జగన్నాధ్, శేఖర్ కమ్ముల, శ్రీను వైట్ల తదితర యువ దర్శకులు సృష్టించిన వినోదం,.పైరసీ ప్రతాపాన్ని తట్టుకుని మరీ వసూళ్లు సాధించటం దేశ చలనచిత్ర పరిశ్రమలని ఆకర్షించటం మొదలుపెట్టింది.

ఈ పరిణామం అంత ఊహించలేనిదేమీ కాదు! సరిగ్గా 2 దశాబ్దాల క్రితం, ఒక సంవత్సరంలో ఏక బిగిన 300 పైచిలుకు చిత్రాలను నిర్మించిన ప్రతిభ ఆంధ్రుల సొంతం! ఈ ఘనత దేశంలో మరే ఇతర ప్రాంత పరిశ్రమకూ ఇంతవరకూ సాధ్యమవ్వలేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా,.హిందీ చిత్ర ప్రేక్షకులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు-తెలుగు ప్రేక్షకులు ఎంత తక్కువ మంది ఉన్నారో బేరీజు వేసి చూస్తే ఆ చిత్రాల నిర్మాణం ఔరా అనిపించకమానదు!

ఈ అత్యధిక చిత్రాల నిర్మాణ రికార్డ్ వెనుక కళారాధన, సాంస్కృతిక మూలాలు, నైపుణ్యం, కఠోర శ్రమ, సాహసం, సంకల్పం ఏ స్థాయిలో పునాదులు వేశాయనే అంశాలు భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక పాఠంగా మిగిలిపోతాయి. ప్రపంచంలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఆంధ్రులదే కదా.

దక్షిణాది చిత్రాల కధనం, శిల్పం, సంగీతం ఉత్తరాది ప్రేక్షకులకు అన్వయించటంలో కొన్ని వైరుధ్యాలు ప్రధాన అడ్డంకిగా ఉంటూ ఉంటాయి. కాగా, అత్యాధునికంగా ఉండే ఆంధ్ర చిత్రాల చిత్రీకరణ, పాటల శైలి, సంగీతపు బాణీలకి తోడు గ్లామర్ కి ప్రాధాక్యత నిచ్చే మన కధానాయకగణం ఉత్తరాది అభిరుచికి ఇట్టే నప్పటం మార్కెట్ లో బలమైన స్థానాన్ని కైవసం చేయగా,.. దేశంలోని టాప్ 10 నృత్య నైపుణ్య హీరోలలో కనీసం 5 స్థానాలు మన ఆంధ్ర బిడ్డలవే అవ్వటం భారతీయవినోద వీక్షకులలో ఆంధ్ర కళా ప్రదర్శనలకి తిరుగులేని గుర్తింపుని దినదిన ప్రవర్ధమానం చేస్తోంది.

ఒకప్పుడు దేశంలో చలనచిత్రాలకి దిక్సూచి లాంటి నవలా రచయితలు దండిగా ఉన్న బెంగాలీ సినిమా కూడా మన సినిమా కధల బాట పట్టటం,..టెక్నిక్ కి పేరుపడిన కోలీవుడ్ సినిమా నుండి క్రమక్రమంగా అక్కడి ప్రేక్షకులు అచ్చ తెలుగు చిత్రాల వైపు చూపు తిప్పటంతో ఇక హిందీ చిత్ర ఉత్పత్తికి మన కధ మూలవస్తువుగా తీసుకోవటం అనివార్యం అయ్యింది! ఈ అవకాశాన్ని బాలీవుడ్ సద్వినియోగం చేసుకుంటూ తెలుగులో విజయవంతమైన చిత్రకధలని అధ్యయనం చెయ్యటం,.. ఠాగూర్, పోకిరి, ఢీ, మర్యాదరామన్న తదితర మన కధలని బాలీవుడ్ అగ్రహీరోలతో ప్రయత్నించి సఫలమవ్వటంతో ముంబయి చిత్ర అనువాద సంస్థల కన్ను ఆంధ్ర సినిమా పైన పడింది.

ఇక, మన పదహారణాల పద ఘట్టనల జైత్రయాత్రని పతాక స్థాయిని చేర్చిన “బాహుబలి” కోసం రాయటానికి పుస్తకాలు సరిపోవు,..ఇప్పుడు ప్రపంచ సినీ చరిత్రలో ఆ చిత్రానికి ఒక అధ్యాయమే కేటాయించారు. బాహుబలితో ఆంధ్ర సినిమా అంటే ఏమిటో ఇప్పుడు ఎవరికి వివరించాల్సిన అవసరం లేకుండా చేశాడు రాజామౌళి. మొత్తంగా, దక్షిణాది సినిమాలంటే విలువల వారధిగా గుర్తించి తీరాలని 2 భాగాలతో వెయ్యి కోట్ల మార్క్ అద్దిన విజయఢంకా మోగించి చాటటం శిలాక్షరాలుగా మిగిపోతాయి.

(మేము 6 నెలల క్రితం గుజరాత్ లోని ఒక తీరప్రాంత పట్టణానికి వెళ్లినప్పుడు ఇంకా అక్కడ బాహుబలి మొదటి భాగం ప్రదర్శన జరుగుతూనే ఉంది!)

ఫలితం, బాలీవుడ్ నటీనటులు సీమాంధ్ర సినిమాలో కనిపించటానికి తమ మానేజర్స్ ని  ఆంధ్ర సినిమా సాంకేతికవర్గాలకి అందుబాటులో ఉంచుతున్నారు. అప్పటి అమ్రిష్ పురి, అమితాబ్ బచ్చన్, పరేశ్ రావెల్ వంటి హేమాహేమీల నుండి నేటి బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, విద్యాబాలన్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి ఎందరో మన టూరింగ్ టాకీస్ లలో మెరవటానికి ఉత్సాహపడి వస్తున్నారు.

 

అయితే, ఒకసారి విభజనకి గురయ్యి మద్రాస్ లో మిగిలిపోయిన ఆంధ్రులు మళ్ళీ కోలుకుని తమ ప్రాంతం అనుకుని పట్టుదలగా పోయిన ప్రాభవాన్ని శిఖరస్థాయికి చేర్చారు,..మళ్ళీ ఇప్పుడు మరొకసారి మళ్ళీ ఇంకొక పరాయి రాష్ట్రంలో చిక్కుకున్న ఆంధ్రసినిమా వచ్చే అయిదేళ్లలో జన్మభూమికి వచ్చేస్తుందని ఢంకా మోగించి చెప్పవచ్చు.

ఎందుకంటే,..దేశం సీమాంధ్ర సినిమా చూస్తోంది…

Leave a Comment