నల్లకుబేరులు 627మంది

దేశంలో మరో కీలకమైన మార్పుకు రంగం సిద్ధమవుతోంది. విదేశాల్లో నల్లధనం దాచుకున్నవారి వివరాలు బట్టబయలు అవుతున్నాయి. నల్లకుబేరుల వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కోరిన 24 గంటల్లోపే ఆ జాబితాను కేంద్రం కోర్టుకు సమర్పించింది. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లో ఖాతాలున్న 627 మంది భారతీయుల జాబితాను సీల్డ్‌కవర్‌లో కోర్టు ముందుంచింది. ఇందులో సగంమంది భారత్‌లో నివాసం ఉంటున్నారని, వీరిపై ఆదాయంపన్ను చట్టం ప్రకారం విచారణ చేపట్టవచ్చన్న కేంద్రం.. మిగతావారు ఎన్నారైలని కోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్, మదన్ బీ లోకూర్‌లతో కూడిన ధర్మాసనం ఈ సీల్డ్ కవర్‌ను తెరవలేదు. నల్లధనంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చైర్మన్ ఎంబీ షా, వైస్‌చైర్మన్ అరిజిత్ పసాయత్ మాత్రమే ఈ జాబితాను తెరుస్తారని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ జాబితాను పరిశీలించి విచారణ ఎంతవరకు వచ్చిందో నవంబర్ చివరిలోగా నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. 2015 మార్చిలోగా విచారణను పూర్తిచేయాలని కూడా సిట్‌కు సూచించింది. ఈ జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కూడా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీ కుబేరుల జాబితాను ప్రభుత్వం తరుఫున కోర్టు ముందుంచిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఇందులోని ఖాతాదారుల వివరాలు 2006 వరకు మాత్రమే ఉన్నాయని.. వీటిని ఫ్రాన్స్ ప్రభుత్వం 2011లో భారత్‌కు అందజేసిందని తెలిపారు. ఈ ఖాతాల్లో 1999-2000 మధ్య అత్యధికంగా లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ నుంచి ఈ సమాచారం చోరీకి గురైందని.. ఆ తర్వాత ఈ లిస్ట్ ఫ్రాన్స్‌కు చేరిందని రోహత్గీ కోర్టుకు చెప్పారు. సీల్డ్ కవర్‌లో మూడు డాక్యుమెంట్లను పొందుపరిచినట్లు తెలిపారు. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, ఖాతాదారుల పేర్ల జాబితా, విచారణ స్థితికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు రోహత్గీ పేర్కొన్నారు. ఈ జాబితాలోని కొంతమంది వ్యక్తులు తమకు విదేశీబ్యాంకుల్లో ఖాతాలున్నట్లు చెప్పినా.. వాటికి సంబంధించిన అన్ని పన్నులు కట్టినట్లు తెలిపారని అటార్నీ జనరల్ కోర్టుకు విన్నవించారు. 2006 తర్వాత విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారి వివరాలు సేకరించాలంటే.. ఆయా ఖాతాదారులు సంబంధిత బ్యాంకులకు నిరభ్యంతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. వివిధ దేశాలతో ఉన్న పన్ను ఒప్పందాలు, వాటివల్ల వచ్చే సమస్యలను సిట్‌కు వివరించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. సిట్ చైర్మన్, వైస్‌చైర్మన్ సాధారణ వ్యక్తులు కారని.. వాళ్లు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలన్న ధర్మాసనం.. నల్లధనం కేసు విచారణలో ఎదురయ్యే సాధకబాధకాలు వారికి తెలుసని స్పష్టంచేసింది. ఈ జాబితాను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందజేస్తాం. చట్టప్రకారం వాళ్లు విచారణ కొనసాగిస్తారు. తదుపరి విచారణ ఎలా జరపాలో ఆ బృందం చూసుకుంటుంది అని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. జాబితాతోపాటు అదనపు సమాచారాన్ని కూడా సిట్‌కు అందజేయాల్సిందిగా ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తదుపరి విచారణ సమయంలో కేజ్రీవాల్ అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపింది.

Leave a Comment