భూసమీకరణకు వ్యతిరేకంగా జనసేన భారీ ధర్నా !

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ ప్రక్రియలో ఉన్న వాటికి తోడు కొత్త తలనొప్పులు తోడవుతున్నాయి. భూసమీకరణకు తమ భూములు ఇవ్వటానికి మిగిలింది 48 గంటలేనని, ఏప్రిల్‌ 30వ తేదీలోగా అందరూ భూములు ఇవ్వాల్సిందేనని, భూములు ఇవ్వని రైతులపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని… ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఎన్ని విధాలుగా భూసమీకరణలో కలసిరాని రైతులకు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా పెద్దగా ఉపయోగం లేకపోగా మరింత తలనొప్పులు మొదలవుతున్నా యి. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 9 గ్రామాల రైతుల్లో అత్యధికులు భూసమీకరణను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. వీరిని నయానోభయానో దారి తెచ్చుకుందామని ప్రభుత్వం, అధికారపార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వటం లేదు. పైగా శుక్రవారం నాడు సనీనటుడు, జనసేన పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు అయిన పవన్‌ అభిమానుల రూపంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. 29 గ్రామాల్లో ఒకటైన బేతపూడి గ్రామంలో జనసేన పేరిట భారీ ధర్నా జరిగింది. భూసమీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెద్ద ఎత్తున ధర్నా జరగటం చర్చనీయాంశమైంది. భూసమీకరణ అంశాన్ని ప్రశ్నిస్తూ ఇటీవలే, జనసేన అధ్యక్షుడు పవన్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి కొనసాగింపుగానా అన్నట్లు శుక్రవారం బేతపూడి గ్రామంలో భూసమీకరణకు వ్యతిరేకంగా ధర్నా జరగటం విశేషం. `పవన్‌ చెబితేనే తెలుగుదేశంపార్టీకి ఓట్లు వేసామని, పవన్‌ వచ్చి తెలుగుదేశంను భూసమీకరణ విషయంలో నిలదీయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటం గమనార్హం. నిరసన మొత్తంలో జనసేన పార్టీ బ్యానర్లు, పవన్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు కనబడటం పలువురిని ఆశ్చర్యపరిచింది. అంటే, జనసేన పేరుతో జరిగిన ధర్నాకు పవన్‌ మద్దతు ఉన్నట్లే పలువురు భావిస్తున్నారు.

ఇదిలావుండగా, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్‌ కూడా శుక్రవారం ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటించి భూసమీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలపటం గమనార్హం. రాజధాని నిర్మాణానికి పచ్చని పంటపొలాలను ముఖ్యమంత్రి ఎంపిక చేయటం పట్ల అగ్నివేష్‌ బాహాటంగా వ్యతిరేకించారు. భూసమీకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి త… న మద్దతు ప్రకటించారు. భూసమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో రైతులతో సభనే నిర్వహించారు. ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, ఎర్రుబాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు జరిపారు. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనలేదని అగ్నివేష్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్సు ఎట్టి పరిస్దితుల్లోనూ చట్ట రూపం దాల్చదని గట్టిగా చెప్పారు. గ్రామపంచాయితీల తీర్మానాలకు రాజ్యాంగంలో చాలా ప్రాధాన్యత ఉందన్నారు. భూసమీకరణను వ్యతిరేకిస్తున్న ప్రతీ గ్రామమూ మళ్ళీ పంచాయితీల్లో తీర్మానాలు చేసి క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిట ీ(సిఆర్‌డిఎ)కి, గుంటూరు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపమని సూచించారు.

Leave a Comment