ముంబయి ఇండియన్స్..ఇండియన్ ప్రీమియర్ లీగ్-2013 ఛాంపియన్. గతేడాది వరస విజయాలతో అదరగొట్టిన ముంబయి, తాజా టోర్నీలో మాత్రం వరస పరాజయాలతో కుంగిపోయింది. దిగ్గజ ఆటగాడు, ముంబయి ఇండియన్స్ ఐకాన్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, సలహాదారు, ముంబయి మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, బౌలింగ్ కోచ్ అనీల్ కుంబ్లే తో పాటు సీనియర్ కోచ్ జాన్ రైట్ వంటి అనుభవజ్ఞులైన సపోర్టింగ్ టీమ్ ముంబయి ఇండియన్స్ సొంతం. ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మొదలయిన ముంబయి ఓటముల ప్రస్థానం..ఆదివారం నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ దాకా సాగుతూనే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మైఖల్ హాస్సీ, కోరే అండర్సన్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమవుతూ వస్తున్నారు. కిందటేడాది చెన్నై తరపున ఆడిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, ఆస్ట్రేలియా వెటరన్ మైఖల్ హాస్సీ అత్యధిక పరుగులు సాధించి ఆరంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కాగా తాజా ఐపీఎల్ వేలంలో హాస్సీని చెన్నై వదులుకున్నపుడు క్రికెట్ పండితులు సహా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ హాస్సీ తాజా ఫామ్‌ను చూశాక, చెన్నై సూపర్ కింగ్స్ తెలివైన నిర్ణయం తీసుకుందని అంగీకరించక తప్పేలా లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న హాస్సీ..సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటంతో క్రీజులో తీవ్రంగా తడబడుతున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్ స్థానం నుంచి తప్పించి..మిడిల్ ఆర్డర్లో ఆడించిన అదే తడబాటు, వైఫల్యం. కోట్లు కుమ్మరించి తెచ్చుకున్న కరీబియన్ స్టార్ కీరన్ పొలార్డ్..కూడా ఆశించిన మేరకు జట్టుకు సహాయకారిగా ఉండటం లేదు. భారీ షాట్లు ఆడటంలో పొలార్డ్ దిట్ట. అయితే తాజా టోర్నీలో భారీ షాట్లు సంగతి దేవుడెరుగు..కనీసం స్కోరు బోర్డుకు కొన్ని పరుగులు జతచేయటం కూడా కష్టంగా పరిణమించింది. ఢిల్లీతో మ్యాచ్‌లో మినహా పొలార్డ్ ఏమ్యాచ్లోనూ రాణించలేదు. ఏరి కోరి..తెచ్చుకున్న కోరే అండర్సన్..ముంబయికి కడగండ్లే మిగిల్చాడు. న్యూజిలాండ్ తరపున కోరే అండర్సన్ వెస్డిండీస్‌పై మెరుపు శతకం బాదటంతో ఐపీఎల్ వేలంలో ఆరు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి మరీ ముంబయి ఇండియన్స్ జట్టులో చేర్చుకుంది. అండర్సన్ మాత్రం జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోతున్నాడు. ఆంధ్రా కుర్రాడు అంబటి రాయుడే ఇపుడు ముంబయి ఇండియన్స్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దదిక్కులా మారాడు. ముంబయి ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కూడా రాయుడు కీలక ఇన్నింగ్స్ ఆడిన జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ..అన్ని విధాలుగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించాల్సిన రోహిత్..తానే విఫలమవుతున్నాడు.
అలాగే మైదానంలో ఫీల్డర్ల మోహరింపు, బౌలర్లను వినియోగించుకోవటంలోనూ రోహిత్ వెనుకంజలో ఉన్నాడనే చెప్పవచ్చు. మలింగ, జహీర్, ప్రజ్ఞాన్ ఓజా, హార్భజన్ సింగ్ వంటి మేటి బౌలర్ల ఓవర్లను సమర్థవంతంగా వాడుకోవటం లేదు. రిజర్వ్ బెంచ్‌పై శాంటోకి, సిమ్మోన్స్ వంటి వారున్నా..తుది జట్టులోకి తీసుకోవటం లేదు. యార్కర్ల కింగ్ లసిత్ మలింగ..మునుపటి స్థాయిలో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించేకున్నాడు. జహీర్ ఖాన్, హార్భజన్ సింగ్‌ల ప్రదర్శనా అంతంత మాత్రమే. బ్యాటింగ్ విభాగంతో పోల్చి చూస్తే బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఒక మోస్తరు ఇన్నింగ్స్‌ను స్కోరు బోర్డుపై ఉంచినా కాపాడుకోగల బౌలర్లు ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నారు. అయితే బుధవారం నాటి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అయినా ముంబయి ఇండియన్స్ గాడిలో పడుతుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ రెండు జట్టు పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏజట్టు నెగ్గినా వైఫల్యాల బాట వీడినట్లే అవుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ రాణించి..గౌరవప్రద స్కోరు సాధిస్తే, ముంబయి మళ్లీ విజయాల పట్టా ఎక్కుతుంది.
Recent Comments