రాజ‌ధాని నిర్మాణానికి వినూత్న ఆలోచ‌న‌లు….

నూత‌న రాజ‌ధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం వినూత్న ఆలోచ‌న‌లు చేస్తోంది. అంత‌ర్జాతీయ రాజ‌ధాని నిర్మాణం కోసం బిల్డ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో బాండ్ల జారీ పై దృష్టి పెట్టింది. బాండ్ల జారీ..నిధుల సేక‌ర‌ణ ద్వారా నిర్మించిన న్యూయార్క్ త‌ర‌హాలో రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఇదే విష‌యాన్ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ దృష్టికి సైతం తీసుకెళ్లింది. దీనికి..ఆర్బీఐ నుంచి కూడా సానుకూల స్పంద‌న.. దీని పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది…
రైతు రుణ‌మాఫీ కోసం కొత్త ఆలోచ‌న చేసి..అమ‌ల్లో పెడుతున్న ఏపి ప్ర‌భుత్వం..ఇప్పుడు రాజ‌ధాని నిర్మాణం కూడా సుల‌భ‌త‌రం చేసేలా కొత్త వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ న‌గ‌రాలు చికాగో, న్యూయార్క్ త‌ర‌హాలో నిధులు స‌మీక‌రించుకొని నిర్మాణాలు పూర్తి చేసుకొనే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందు కోసం..ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని ప్రాంతాల్లో అనుస‌రించిన మున్సిప‌ల్ బాండ్ల త‌ర‌హాలో బిల్డ్ ఏపి పేరుతో బాండ్ల జారీ కోసం ఆలోచ‌న‌లు చేస్తోంది.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించిన విధంగా.. రాజ‌ధాని నిర్మాణం విజిటియం ప‌రిధిలోనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేయటంతో..అక్క‌డ ఉన్న విజిటియం ను కేపిట‌ల్ రీజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీగా మార్చ‌నున్నారు. ఈ అథారిటీకి పెట్టుబ‌డిగా ఏపి ప్ర‌భుత్వం కొంత మొత్తాన్ని మూలధ‌నంగా కేటాయించ‌నుంది. ఈ అథారిటీ ప‌రిధిలోకి వ‌చ్చే సంస్ధ‌లు..భూముల‌ను సెక్యుర‌టైజ్ చేసి బాండ్లు సేక‌రించాల‌నేది ప్ర‌భుత్వం చేస్తున్న ఆలోచ‌న‌. దీనిపై ఏపి నిధుల స‌మీక‌ర‌ణ క‌మిటీ లోతుగా అధ్య‌య‌నం చేస్తోంది.

ఈ బాండ్లు ముందుగా రాజ‌ధాని కోసం జారీ చేయాల‌ని దాదాపు నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో.. కొన్ని మున్సిపాల్టీలు..కార్పొరేష‌న్ల‌లో కూడా అవ‌స‌ర‌మైతే అమ‌లు చేయాల‌నుకుంటున్నారు. రాజ‌ధానికి  ల‌క్ష‌ల కోట్లు వ్య‌యం కానుండటంతో.. కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం అసెంబ్లీ, రాజ్‌భ‌వ‌న్‌, స‌చివాల‌యం వంటి వాటికే నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. ఏపి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఉన్న ఆర్ధిక ప‌రిస్థితుల కార‌ణంగా పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు సాధ్యం కాదు. దీంతో.. ఈ మార్గం ద్వారా సేక‌రించిన నిధుల‌తో అభివృద్ది కార్య‌క్ర‌మాలు కొత్త రాజ‌ధానిలో మొద‌లు పెట్టాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. త‌ద్వారా..అక్క‌డి భూముల విలువ‌ల పెరగ‌టం..ప‌న్నులు పెర‌గ‌టంతో ఎవ‌రైతే బాండ్లు తీసుకుంటారో వారికి..బాండ్ల మొత్తాలు పెరుగుతాయి. ఇలా చేయ‌గ‌లిగితే..ప్రైవేటు సంస్ధ‌లు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, వ్య‌క్తులు బాండ్లు తీసుకొనేందుకు ముందుకు వ‌స్తార‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. దీని ద్వారా..పెద్ద మొత్తంలో నిధులు స‌మీక‌రించుకోనుంది.

బిల్డ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో బాండ్ల జారీ అంశాన్ని ఏపి ప్ర‌భుత్వం…రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామరాజ‌న్ దృష్టికి తెచ్చింది. బాండ్లు జారీ చేయాలంటే..ఆర్బీఐ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో..త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను..బాండ్ల జారీ అంశాల‌ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కు ఏపి నిధుల స‌మీక‌ర‌ణ క‌మిటీ అధ్య‌క్షుడు సుజ‌నా చౌద‌రి వివ‌రించారు. దీనిపై ర‌ఘురామ రాజ‌న్ ప్ర‌భుత్వ ఆలోచ‌న ను అభినందించారు. న్యూయార్క్‌, చికాగో వంటి న‌గ‌రాలు ఈ ర‌కంగా నిధులు సేక‌రించి అభివృద్ది అయ్యాయంటూ సంసిద్ద‌త వ్య‌క్తం చేశారు. దీంతో…మ‌రింత ప‌క్కాగా ఈ ప్రణాళిక అమ‌లు చేసేందుకు ఏపి ప్ర‌భుత్వం నిపుణుల సల‌హాలు తీసుకుంటుంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో దీనిని ప్ర‌జ‌ల ముందుకు తేవాల‌ని ఆలోచ‌న చేస్తోంది.
నిధుల స‌మీక‌ర‌ణ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు స‌ద్వినియోగం చేసుకుంటున్న ఏపి ప్ర‌భుత్వం…బిల్డ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేర‌తో ఇక్క‌డ ఉన్న వారితో పాటు..ప్ర‌వాసాంధ్రుల‌కు కూడా ఆక‌ర్షించే రీతిలో..విధి విధానాలు ఖ‌రారు చేస్తోంది.

Leave a Comment