రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటున్నారు, పొలిటికల్ గ్యాప్ కాదు: బడ్జెట్‌పై బాబు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌పై బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెక్కలు తెగగొట్టి ఎగరమంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపితో రాజకీయమైన అంతరం లేదని, ఉన్నవి ఆర్థిక, విధాన నిర్ణయాల అంతరం మాత్రమేనని ఆయన అన్నారు. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మిస్తామని ప్రధాని మోడీ అన్నారని, దాన్ని అమలు చేయాలని అడుగుతున్నామని, అది రాజకీయ నిర్ణయమని, విభజన రాజకీయ నిర్ణయమని, అందువల్ల న్యాయం చేయడానికి కూడా రాజకీయ నిర్ణయమే కావాలని చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు శనివారం సాయంత్రం విస్తృతంగా మాట్లాడారు. విభజనలో తనను ఎక్కడా భాగస్వామిని చేయలేదని, ఏం చెప్పకుండా చేస్తున్నారని తాను చెప్పానని, చాలా సమస్యలు వస్తాయని చెప్పానని ఆయన అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రాలు విడుదలచేశానని ఆయన చెప్పారు. కేంద్రం తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని, అయినా ఫలితం దక్కలేదని ఆయన అన్నారు. ఎపికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ మీద, కేంద్రం మీద ఉందని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తే తప్ప న్యాయం జరగదని, ఒప్పిస్తామనే నమ్మకం ఉందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇలా అయితే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై పెద్దలను కలుస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికావసరాలను కేంద్ర బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఎంసెట్, జలాల పంపకాలపై తానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెసు చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్ఱధాని మోడీపై ఉందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలా కేంద్రం సాయం చేయాల్సిందేనని ఆయన అన్నారు. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వరకు సాయం చేయాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి సమస్యలను వివరిస్తానని ఆయన అన్నారు. బడ్జెట్‌లో ఎపికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆయన అన్నారు. అందరితో సమానంగా ఎపి పైకి వచ్చేంత వరకు చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు కేంద్ర బడ్జెట్‌ను తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆర్థిక సంఘం పూర్తిగా నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు బౌగోళికంగా కలవకున్నా విద్వేషాలు లేకుండా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచించి కసిని సానుకూల శక్తిగా మార్చుకోవాలని ఆయన అన్నారు.

Leave a Comment