రోడ్డుపై డబ్బులు విసిరేసి.. హల్‌చల్!

1*ఫోర్జరీ సంతకంతో డబ్బు డ్రా చేసిన కొడుకు
*సీసీ కెమెరాతో కనిపెట్టిన యజమాని
*పోలీసులకు చిక్కకూడదని రోడ్డుపై డబ్బు పడేసిన నిందితుని తండ్రి

పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరులో  ఓ వ్యక్తి రోడ్డుపై డబ్బులు విసిరేసి హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే. తిరుపతికి చెందిన శ్రీధర్ బెంగళూరులోని మారుత్‌హళ్లి అయ్యప్ప లేఔట్‌లో రియల్టర్‌గా ఉన్నాడు. ఇతని వద్ద తిరుపతికే చెందిన డాల్ రెడ్డి(29) నమ్మకస్తునిగా ఉండేవాడు. డాల్‌రెడ్డి యజమాని చెక్కులను ఫోర్జరీ చేసి అక్కడి బ్యాంకులో బుధవారం ఉదయం రూ.1.49 లక్షలు డ్రా చేసుకున్నాడు. దీంతో శ్రీధర్ సెల్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే అతను బ్యాంకు కు వెళ్లి విచారించగా అక్కడి సీసీ కెమెరాల ద్వారా విషయం బయటపడింది.

అతను డాల్‌రెడ్డిని నిలదీశాడు. ఆ డబ్బును తన తండ్రి వద్ద ఇచ్చి తిరుపతికి బస్సులో పంపేశానని డాల్‌రెడ్డి చెప్పాడు. వెంటనే బస్సు నుంచి దిగేయాలంటూ డాల్‌రెడ్డి ద్వారా అతని తండ్రికి ఫోన్ చేయించారు. దీంతో డాల్‌రెడ్డి తండ్రి పలమనేరు మార్కెట్ కమిటీ వద్ద మెయిన్‌రోడ్‌పై బస్సు దిగాడు. తన వద్ద ఉన్న లక్షకు పైగా డబ్బును రోడ్డుపై విసిరేశాడు. ఆ డబ్బు తనది కాదని చెప్పడం మొదలు పెట్టాడు. స్థానికులు ఈ వ్యవహారంతో ఆశ్చర్యపోయారు.

ఇంతలో అక్కడకు శ్రీధర్ మరికొందరితో కలసి కారులో చేరుకున్నాడు. రోడ్డుపై ఉన్న డబ్బును తీసుకుని, డబ్బు విసిరేసిన వ్యక్తిని కారులో కూర్చొబెట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడు శ్రీధర్ స్థానిక సీఐ బాలయ్యకు విషయం వివరించాడు. బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. దీంతో వారందరినీ సీఐ బెంగళూరుకు పంపేశారు. ఈ వ్యవహారం పలమనేరులో నిన్న హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Comment