స్టాక్ మార్కెట్‌పై ‘చిన్న’ చూపు ఎందుకో?

the stock marketహెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్…. ఈ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అదనంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీలో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు?                        – హితేష్, నిజామాబాద్
 
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్ అనేది వాల్యూ-ఓరియెంటెడ్ ఫండ్. మీ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ ఫండ్ ఇది. ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఇది మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇది సెక్టోరియల్ ఫండ్. వ్యవస్థాగత మార్పులకు, తీవ్ర ఒడిదుడుకులకు గురువుతుండే ఫండ్ ఇది. ఇప్పటికైతే ఈ ఫండ్ ద్వారా మీకు మంచి లాభాలే వచ్చి ఉంటాయనుకుంటున్నాను. అందుకే ఈ ఫండ్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం. ఈ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించి ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ  ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.
 
స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2008 భారీ పతనం తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌కేసే చూడడం లేదు. ఎందుకని? – భువనేశ్వరి, గుంటూరు
 
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో వచ్చింది చిన్న ర్యాలీ మాత్రమే. చిన్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్నారన్న మీ అభిప్రాయం సరైనదే. భారత మార్కెట్లు ఆకర్షణీయమైనవని విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. ఈ విషయంపై చిన్న ఇన్వెస్టర్లకు ఇంకా నమ్మకం కుదరడం లేదు. బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10% రాబడి వస్తుండటంతో చిన్న ఇన్వెస్టర్లు.. వాటిపై ఆసక్తి చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లు బాగా లేకపోయినప్పటికీ, వడ్డీరేట్లు పెరిగిపోవడంతో తమ రాబడులు బాగానే ఉన్నాయని వారనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా ఇన్వెస్టర్లకు దక్కే నికర రాబడులు స్వల్పమే అయినప్పటికీ, అదే పదివేలు అనుకుంటున్నారు. సాధారణంగానే భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం తక్కువే.

 నేను ఒక మిత్రుడి సలహా ప్రకారం అవైవా-సేవ్‌గార్డ్ యులిప్ స్కీమ్‌లో 2006లో ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే నేను ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోలిగాను. ప్రతీ ఏడాది ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలు వసూలు చేస్తోంది. మరోవైపు సరెండర్ పెనాల్టీ భారీగా ఉండటంతో ఈ స్కీమ్‌ను బలవంతంగా కొనసాగించాల్సి వస్తోంది.
 
ఎనిమిదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ వచ్చినప్పటికీ, సంతృప్తికరమైన రాబడులు లేవు. ఇలాంటి సంస్థలు ఇలాంటి స్కీమ్‌లను నిర్వహించడానికి నియంత్రణ సంస్థలు ఎలా అనుమతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. చిన్న ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన సొమ్ములు ఇలాంటి సంస్థల పాలు కావల్సిందేనా? ఈ పరిస్థితుల నుంచి తక్కువ నష్టాలతో బయటపడే మార్గాన్ని సూచించండి.              – హఫిజ్, హైదరాబాద్
 
అవైవా సేవ్‌గార్డ్ అనేది నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ఇది చాలా పాత పాలసీ. ఈ సంస్థ పెద్ద మొత్తంలో చార్జీలను వసూలు చేస్తుందనే విషయం వాస్తవమే. ఈ ప్లాన్‌కు సంబంధించి ప్రీమియం అలొకేషన్ చార్జ్ అనేది ప్రతీ ఏడాది 4 నంచి 6 శాతంగా ఉంటోంది. ఇక ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు 0.75 శాతం నంచి 1.75 శాతం రేంజ్‌లో ఉంటున్నాయి. ఇవి కాక పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీ, మోర్టాలిటీ చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో రాబడులు తక్కువగా ఉంటున్నాయి.
 
ఇలాంటి సంప్రదాయక బీమా పాలసీలు మంచి రాబడులను ఇవ్వలేవు. సదరు సంస్థలు మీ సొమ్ములను సురక్షితమైన రుణసాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుండడమే దీనికి కారణం. మరోవైపు అధికంగా ఉండే చార్జీలు మీ లాభాలను తినేస్తాయి. ఈ ప్లాన్ మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఐదు రెట్లు లైఫ్ కవర్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది ఏ మాత్రం సరిపోదు. టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఇవి తక్కువ ప్రీమియానికే ఎక్కువ బీమాను అందిస్తున్నాయి. మీకు ఏమైనా అయితే మీ కుటుంబ అవసరాలకు ఎంత మొత్తం కావాలో లెక్కించి, ఆ మేరకు టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక ఇన్వెస్ట్‌మెంట్స్ విషయానికొస్తే, మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, టాటా బ్యాలెన్స్‌డ్, బిర్లా సన్‌లైఫ్ 95.. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
 
ఇక మీ అవైవా పాలసీ విషయానికొస్తే, మీరు ఈ పాలసీని సరెండర్ చేయండి. మీరు ఏడేళ్లపాటు ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే, ముఖ విలువలో 1 శాతంగా సరెండర్ చార్జీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎనిమిదేళ్లకు మించి ప్రీమియమ్‌లు చెల్లించి ఉంటే ఎలాంటి సరెండర్ చార్జీలు ఉండవు.  ఈ పాలసీని సరెండర్ చేసి నష్టాలను పరిమితం చేసుకోండి.

Leave a Comment