16 ఏళ్ల తర్వాత…

Footballనైజీరియాకు తొలి విజయం
  1-0తో బోస్నియాపై గెలుపు
 
 క్యుఅబా (బ్రెజిల్):  ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆఫ్రికన్ దేశం నైజీరియా కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో నైజీరియా 1-0 తేడాతో బోస్నియా అండ్ హెర్జిగోవినాను ఓడించింది. 1998 ప్రపంచకప్‌లో మ్యాచ్ నెగ్గిన నైజీరియాకు 16 ఏళ్ల తర్వాత మరో గెలుపు దక్కడం విశేషం. మ్యాచ్ 29వ నిమిషంలో పీటర్ ఒడెమ్‌వింగీ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఈ పరాజయంతో బోస్నియా వరల్డ్‌కప్ నుంచి నిష్ర్కమించింది.
 
 ఇరాన్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే నైజీరియా ఆటతీరు ఎంతో మెరుగైంది. ఆరంభం నుంచే ఆ జట్టు ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఎమాన్యుటేల్ ఎమినెక్ దూకుడుగా ఆడాడు. చివరకు అతని ద్వారానే గోల్ సాధ్యమైంది. బోస్నియా కెప్టెన్ ఎమిర్ స్పాహిక్‌ను తప్పిస్తూ దూసుకొచ్చిన అతను ఒడెమ్‌వింగీకి పాస్ అందించాడు. దానిని చక్కగా అందుకున్న ఒడెమ్ ఎలాంటి తడబాటు లేకుండా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత బోస్నియా ఆటగాడు ఎడిన్ జెకో గోల్ చేసినా… రిఫరీ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో జట్టు నివ్వెరపోయింది. మరో రెండుసార్లు ఎడికో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా నైజీరియా కీపర్ ఎనీమా సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో తొలిసారి వరల్డ్ కప్ ఆడిన బోస్నియా తొలి రౌండ్‌లోనే నిరాశగా వెనుదిరిగింది.
 
 తాజా ఫలితంతో నైజీరియా (4 పాయింట్లు) నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయి. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు అర్జెంటీనాతో తలపడుతుంది. అర్జెంటీనా ఇప్పటికే నాకౌట్ చేరగా… నైజీరియా కనీసం ‘డ్రా’ చేసుకున్నా ప్రిక్వార్టర్స్ చేరుతుంది. ఒకవేళ ఓడినా… బోస్నియాపై ఇరాన్ (1 పాయింట్) భారీ తేడాతో గెలవకుంటే నైజీరియా ముందుకు వెళుతుంది.
 

Leave a Comment