మృత్యు విస్ఫోటం

* పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్
* 16 మంది దుర్మరణం
* తూర్పుగోదావరి జిల్లా ‘నగరం’ గ్రామంలో దారుణం
* 27 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
* కిలోమీటర్ పరిధిలో సర్వం బుగ్గి.. కోట్లలో ఆస్తి నష్టం
* విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ: కేంద్రం
* మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
* తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు
* బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు
 
అమలాపురం/మామిడికుదురు/కాకినాడ క్రైం: పచ్చని కోనసీమలో ప్రాణాంతకమైన చిచ్చు ప్రజ్వరిల్లింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైపులైన్ ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. 30, 40 మీటర్ల ఎత్తులో కోరలుసాచి విరుచుకుపడ్డ దావాగ్ని కీలలు చూస్తుండగానే విధ్వంసం సృష్టించాయి. దాదాపు కిలోమీటరు పరిధిలో పచ్చని గ్రామాన్ని భస్మీపటలం చేయడమేగాక 16 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. మరో 27 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పెనుగులాడుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రచండ వేగంతో ఎత్తివచ్చిన పెను మంటల బారిన పడి పలువురు నిద్రలోనే నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు. ఇంకొందరు తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తుతూనే నిలువునా కాలిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఉదయం 5.10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాలం చెల్లిన పైప్ లైన్ కావడంతో గ్యాస్ ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయిందని చెబుతున్నారు.

మంటల ధాటికి కిలోమీటర్ పరిధిలో పచ్చని కొబ్బరి తోటలు చూస్తుండగానే నిలువునా అంటుకున్నాయి. పావుగంట వ్యవధిలో కాలిపోయి మొండి మోడులై మిగిలాయి. పదుల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామంలోనూ, ఊరి మీదుగా వెళ్తున్న 218 నంబర్ జాతీయ రహదారిపైనా పలు వాహనాలు బూడిద కుప్పలుగా మిగిలాయి. పైపులైను పేలుడు జరిగిన ప్రాంతంలో ఏకంగా 10 అడుగుల గొయ్యి ఏర్పడింది. పేలుడు ధాటికి పైపులైన్‌పై కప్పిన కాంక్రీట్ గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది.

చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పాక కూడా చాలాసేపు భూమిలోంచి పొగలు, వేడిగాలులు వచ్చాయి. పైగా మంటలను ఒకవైపు ఆర్పుతుండగానే అవి మరోవైపు చెలరేగుతూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలికి సమీపంలోనే ఉన్న ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ జీసీఎస్‌లకు మంటలు వ్యాపిస్తే పెను విధ్వంసమే జరిగి ఊరంతా శ్మశానప్రాయంగా మారేదే! కానీ అవి జీసీఎస్ మెయిన్ గేట్ దరిదాపుల వరకూ వ్యాపించి అక్కడితో ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చడమే గాక కోట్లలో ఆస్తి నష్టం కలగజేసిన ఈ ఘోరకలి లాభార్జనే తప్ప జనం భద్రత పట్టని చమురు సంస్థల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి రూ. 5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. బాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. తామూ హై పవర్ కమిటీ వేశామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు ప్రకటించారు.

అంతా క్షణాల్లో
పైపులైను పేలుడు సంభవించిన సమయంలో గాలి ఉధృతంగా వీస్తుండడంతో ఆ ప్రాంతానికి పశ్చిమంగా అర కిలోమీటరు మేర క్షణాల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఏం జరిగిందో తెలిసేలోపే పలువురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడి మసైపోయాయి. ఆ సమయంలో స్థానికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భీతిల్లి పరుగులు తీశారు. వారిని కూడా అగ్నిగోళాల్లాంటి మంటలు వెంటాడి గాయపరిచాయి. దూరంగా ఉన్నవారు అగ్నికీలల ఉగ్రరూపాన్ని చూసి కళ్లెదుటే తోటి మనుషులు తగలబడుతున్నా దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు.

ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది, మరో ఇద్దరు ఉద్యోగులు, ఇతర కుటుంబాలకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి, కిమ్స్ ఆస్పత్రికి, రాజోలు ఏరియా ఆస్పత్రికి, రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలించారు. 80 శాతానికి పైగా గాయాలవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాలిన గాయాలతో వారు చేస్తున్న ఆర్తనాదాలు అందరి హృదయాలనూ కలచి వేస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక  జ్యోత్స్నాదేవి అనే చిన్నారి కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విస్ఫోటం జరిగిన చోటికి సమీపంలో మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. స్కూళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది.

40 మీటర్ల ఎత్తుకు ఎగసిన కీలలు
పైప్‌లైన్‌లో గ్యాస్ ఎగదన్నడంతో మంటలు బ్లో అవుట్ తరహాలో దాదాపు 40 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే జీసీఎస్ నుంచి గ్యాస్ సరఫరా నిలిపివేసినా అప్పటికే పైపులో ఉన్న గ్యాస్ వల్ల గంట పాటు మంటలు ఎగదన్నుతూనే ఉన్నాయి. అంతెత్తున ఎగసిపడే మంటలను పైపులైన్ వద్దకు వెళ్లి  ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపటి వరకూ సాహసించలేకపోయారు.
 
పెను విషాదంపై అలసత్వం
గ్యాస్ విస్ఫోటనంపై చమురు సంస్థల అధికారులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ చురుగ్గా స్పందించలేదు. ఉదయం 5.10కి ఘోరం జరిగినా 6.30 వరకూ అగ్నిమాపక శకటాలు రాలేదు. పక్కనే ఉన్న జీసీఎస్, మినీ రిఫైనరీల అగ్నిమాపక శకటాలు కూడా వెంటనే రంగంలోకి దిగకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పోలీసులు తప్ప ఏ శాఖల అధికారులూ సకాలంలో స్పందించలేదు. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి కొన్నిచోట్ల మంటలను అదుపు చేసినా, మరికొన్నిచోట్ల రాజుకుంటూనే ఉన్న మంటలను చూసీచూడనట్టు వదిలేశాయి. స్థానిక ఎమ్మెల్యేలు మండిపడడంతో వాటిని ఆర్పేందుకు ఉపక్రమించాయి.

ప్రైవేటు చమురు సంస్థలు రవ్వ, రిలయన్స్‌లకు చెందిన శకటాలు వచ్చేసరికే మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రమాదంపై స్థానిక అధికారులు స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాటిపాక ఓఎన్జీసీ జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఉపద్రవం జరిగిందని,  తర్వాత కూడా వారు స్పందించలేదని ఆరోపిస్తూ స్థానికులు దానిపై దాడికి యత్నించారు. మెయిన్ గేట్‌ను దాటుకుని జీసీఎస్ వైపు దూసుకుపోయారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు.   సిబ్బంది వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు.  
 
మంటలా, పేలుడా.. ఏది ముందు?
ఈ ఘోరానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) నుంచి విజయవాడలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు ‘గెయిల్’ సంస్థ గ్యాస్ సరఫరా చేస్తోంది. దీనికి సంబంధించిన పైపులైన్ నగరం గ్రామం వద్ద వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. ఆ విస్ఫోటంతో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై పరిసరాల్లో వ్యాపించింది. తర్వాత కొద్ది సమయానికే పైపులైన్ మరోసారి పేలిపోయింది.

అప్పటికే చుట్టూ గ్యాస్ ఆవరించి ఉండడంతో రెప్పపాటు కాలంలోనే గ్రామాన్ని మంటలు చుట్టుముట్టాయి. సెకన్‌కు 40 కేజీల ఒత్తిడితో గ్యాస్ వెళ్తుండగా పైపులైన్ పేలిందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. రెండు పైపుల మధ్య జాయింట్ వద్ద ఈ పేలుడు సంభవించింది. సరిగ్గా ఇక్కడే మూడు నెలల క్రితం పైపులైన్ లీకైందని, అయినా గెయిల్ అధికారులు పట్టించుకోనందువల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి నుంచే పైపులైన్ నుంచి గ్యాస్ లీకవుతూ వచ్చిందన్నది మరో కథనం. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుందని నగరం వాసులు పెద్దగా పట్టించుకోలేదు. అటు గెయిల్ అధికారులూ  లీకేజీని గుర్తించలేదు. దీంతో ఆ ప్రాంతమంతా వాతావరణంలో గ్యాస్ కమ్ముకుంది.

శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక హోటల్ యజమాని పొయ్యి వెలిగించబోగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు అంటుండగా, ఒక మహిళ ఇంట్లో పొయ్యి వెలిగించగానే విస్ఫోటం సంభవించిందని మరికొందరం టున్నారు. లీకైన తరువాత గాలి వాలు వల్ల ఓఎన్జీసీ జీసీఎస్ వైపు గ్యాస్ ఎక్కువగా వ్యాపించింది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అటు మళ్లింది. జీసీఎస్ ప్రధాన గోడకు 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. అదే జీసీఎస్‌లో జరిగి ఉంటే ఊరంతా శ్మశానంగా మారేదని స్థానికులు అంటున్నారు.
 
పక్షులూబుగ్గయ్యాయి
గ్యాస్ అలముకున్నాక మంటలు చెలరేగడంతో చెట ్లమీది పక్షులు సైతం తప్పించుకునే వీలులేక మసిబొగ్గుల్లా మిగిలాయి. 12 ఇళ్లు, ఒక సంస్థ కార్యాలయం, ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

స్థానికుల వాహనాలతో పాటు గ్రామంగుండా వెళ్తున్న 216 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారి వాహనాలు సైతం తగలబడిపోయాయి. సుమారు 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు కాలి బూడిదయ్యాయి. రూ.10 కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Leave a Comment