గర్భం రాకుండా 16 ఏళ్లు..

71404768568_625x300వాషింగ్టన్: కొత్తగా పెళ్లయింది.. కొన్నేళ్లపాటు పిల్లలు వద్దనుకున్నారు.. గర్భం రాకుండా ఉండడం కోసం క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి.. కండోమ్‌లు వంటి పద్ధతులనైనా అనుసరించాలి. ఎక్కువకాలం కొనసాగేలా కాపర్ టీ వంటి కొన్ని పద్ధతులున్నా.. వాటికోసం వైద్యుల వద్దకు వెళ్లడం, శరీరంలో పరికరాలను అమర్చుకోవడం తప్పదు.. కానీ కేవలం ఒకసారి అమర్చుకుంటే.. దాదాపు పదహారేళ్లపాటు గర్భం రాకుండా చూసుకోగలిగే సరికొత్త పరికరం రాబోతోంది. దీంతోపాటు ఇచ్చే ఒక చిన్న రిమోట్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.

అమెరికాకు చెందిన మసాచుసెట్స్ సాంకేతిక వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. రెండు సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉండే ఈ పరికరాన్ని శరీరంలో చర్మం కింద అమర్చుతారు. దీనిలో గర్భం రాకుండా ఉండేందుకు తోడ్పడే ‘లెవొనోర్జెస్ట్రెల్’ ఔషధం దాదాపు 16 ఏళ్లకు సరిపడా ఉంటుంది. ఈ పరికరం ఔషధాన్ని రోజూ 30 మైక్రో గ్రాముల చొప్పున శరీరంలోకి విడుదల చేస్తుంది. రిమోట్ సహాయంతో ఔషధం విడుదలను, స్థాయిని నియంత్రించవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ పరికరాన్ని వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. 2018 నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశముందని వర్సిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
 

Leave a Comment