ఎటు చూసినా బూడిద కుప్పలే

gail victimsమరుభూమిలా మారిన నగరం
 సన్నిహితుల శవాలు, కాలిన ఇళ్లను చూసి విలపిస్తున్న గ్రామస్తులు
 
 అమలాపురం/ మామిడికుదురు/కాకినాడ క్రైం: ఎటు చూసినా పచ్చటి పొలాలు, గుబురు చెట్లు.. ఆకాశాన్నంటే కొబ్బరి తోటలు.. సెలయేర్లలో తామర, కలువ పూల హొయలు.. పాడి పశువులతో కళకళలాడే పశువుల కొట్టాలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతికి పట్టుగొమ్మలా ఉండే నగరం గ్రామం మొన్నటి చిత్రమిది. నేడు.. అదో రగులుతున్న చితి. ప్రకృతిని వికృతిగా మార్చిన నిర్లక్ష్యానికి బలైన గ్రామం. చైనా డ్రాగన్‌లా బుసలుకొడుతూ విరుచుకుపడిన అగ్నిగోళాలకు గ్రామం మొత్తం మాడి మసైపోయింది. తెలతెలవారుతుండగా పక్షుల కిలకిలలతో నిద్ర లేవాల్సిన ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. లేగదూడల పరుగులు, పశువుల పదఘట్టనలకు లేచే దుమ్ముతో, కమ్మని మట్టి వాసనతో దినచర్య మొదలెట్టాల్సిన గ్రామం అగ్నిగోళాల మధ్య చిక్కుకుని విలవిల్లాడింది. పల్లె జనం దిక్కూతెన్నూ తెలియకుండా పరుగులెత్తారు. శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపు లైను సృష్టించిన విధ్వంసానికి గ్రామం గ్రామమే వల్లకాడులా మారింది. శనివారం ఆ గ్రామానికి వెళ్లిన వారికి అదో మరుభూమిలా కనిపించింది. ప్రకృతి సోయగం మాయమైంది. ఎటు చూసినా బూడిద కుప్పలే దర్శనమిచ్చాయి. కాలిపోయిన ఇళ్లు, మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. నిండు గెలలతో ఉండాల్సిన కొబ్బరి చెట్లు ఇప్పుడు మాడిపోయి నల్లగా మారిపోయాయి. మసిబొగ్గులా మారిన పశువులు, పక్షులు అక్కడక్కడా పడి ఉన్నాయి. అక్కడక్కడా నిప్పు రగులుతూనే ఉంది. పెను మంటల్లో కాలిపోయిన దేహాల వాసన ఇంకా వస్తూనే ఉంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు ఒక్కొక్కరుగా తిరిగి వస్తున్నారు. తమ వారి కోసం వెదుక్కుంటున్నారు. సన్నిహితులు, బంధువులు, తోటి గ్రామస్తులు మరణించిన విషయం తెలుసుకొని బోరుమంటున్నారు. కాలిపోయిన ఇళ్లు, విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బతుకులేమిటంటూ కుమిలిపోతున్నారు. ఈ విషాదం తమ జీవితాల్లో మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి మృతి
 
 గెయిల్ గ్యాస్ పైపులైను పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది.  పేలుడు జరిగిన శుక్రవారంనాడే 16 మంది మృత్యు వాత పడగా, 27 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయుడు సూర్యనారాయణ (20), మహమ్మద్ తక్వి (42) శనివారం మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న కాశి చిన్నా, తాటికాయల రాజ్యలక్ష్మి, ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వానరాశి వెంకటరత్నం, బోణం రత్నకుమారి, బోణం పెద్దిరాజు, సాయిసుధ ఆస్పత్రిలో ఉన్న రుద్ర సూరిబాబుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
 
 పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన హైపవర్ కమిటీ
 
 గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీ శనివారం నగరం గ్రామానికి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీల విభాగం) ఆర్.పి.సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం పేలుడుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో మట్టి, పైపుల నమూనాలను సేకరిస్తోంది. ఈ కమిటీలో చమురు సంస్థల భద్రత డెరైక్టరేట్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లకు చెందిన అధికారులున్నారు. జనావాసాల మధ్య నుంచి పైపులైన్ వెళ్లడంపై సింగ్ విస్మయం వ్యక్తంచేశారు. పేలుడుకు కారణాలను ఒకట్రెండు రోజుల్లో తేలుస్తామని ఆయన చెప్పారు.
 
 నష్టం అంచనాకు సర్వే బృందాలు
 
 పేలుడు వల్ల జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు ప్రభుత్వం సర్వే బృందాలను నియమించింది. ఈ బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఆర్‌ఐ, హౌసింగ్, విద్యుత్, ఆరోగ్యం, ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 50 మందితో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

Leave a Comment