28 భాషల్లో నిత్యానంద రాసిన 200 పుస్తకాలు

nityanandaవివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద పుస్తకాలు ఢిల్లీలోని ప్రపంచ పుస్తక ప్రదర్శన(వరల్డ్ బుక్ ఫెయిర్‌)లో దర్శనమిస్తున్నాయి. ఆధ్యాత్మికపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన 28 భాషల్లో రాసిన 200 పుస్తకాలు ఇందులో పుస్తక ప్రియులకు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆడియో, వీడియో సీడీలు కూడా ఉన్నాయి. నిత్యానంద రాసిన పుస్తకాలు ప్రధానంగా ఆంగ్లం, హిందీ, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, చైనా భాషల్లో అధికంగా ఉన్నాయి. అదేవిధంగా భారత జాతిపిత మహాత్మగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పుస్తక ప్రదర్శనలోని పలు స్టాళ్లలో తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు. భగవద్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలను కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు.

ఇక్కడ చాలామంది అహింస, వెజిటేరియనిజం వంటి అంశాలపట్ల అవగాహన తెలియజేసే పత్రాలను ఉచితంగా పంచిపెడుతున్నారు. వీటితోపాటు ఆర్యసమాజ్‌కు చెందిన పుస్తకాలు, భౌద్ధమతానికి చెందినవి, విశ్వ జైన సంఘటన సంస్థవి, ముస్లిం మతానికి చెందిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ‘ఘర్ వాపసీ’ శీర్షికతో కూడిన పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. పలు ఆధ్యాత్మిక సంస్థలకు తమకు సంబంధించిన వివిధ పుస్తకాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కాగా, నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్లో దాదాపు 30 దేశాలకు చెందిన ఆధ్మాత్మిక సంస్థలు తమ పుస్తకాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి 22న ముగియనుంది.

Leave a Comment