6 నెలలు.. 70 కేజీలు

అక్రమ బంగారం దుబాయ్ టు హైదరాబాద్81404420745_625x300
* సినీ ఫక్కీలో స్మగ్లింగ్
* సహకరిస్తున్న కస్టమ్స్, విమాన, హౌస్ కీపింగ్ సిబ్బంది!
* క్యారియర్లకు ప్రత్యేక సర్జరీల ద్వారా శరీరంలో ఏర్పాట్లు
 
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణాకు సంబంధించిన బంగారం అక్షరాలా 70 కేజీల పైమాటే. ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి ‘దిగుమతి’అయిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది.

లాభసాటిగా మారిన ఈ వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరు బడా వ్యాపారులు, పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు క్యారియర్లను ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా నడుపుతున్నారని కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 1,326 డాలర్లు ఉంది. బంగారం అక్కడ కొనుగోలు చేసి అధికారికంగా తీసుకురావాలన్నా పన్ను విధానంతో అది లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రం ఉండేది. ఆ తరవాత కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పది గ్రాములకు కనీసం రూ.మూడు వేల వరకు పన్ను కట్టాల్సివస్తోంది.

ఈ లెక్కన కేజీ బంగారం దేశీయ మార్కెట్ రేట్ల ప్రకారం రూ.28 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు అవుతుండగా… దుబాయ్‌లో గరిష్టంగా రూ.25 లక్షలే. దీంతో స్మగ్లర్లకు కనిష్టంగా రూ.3 లక్షల లాభం ఉంటోంది. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేసే ప్రతిపాదనలు ఉన్నాయని, ఈలోపే భారీగా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ముఠాలు చెలరేగుతున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.
 
క్యారియర్లు, రెక్టమ్ కన్‌సీల్‌మెంట్…
బంగారం అక్రమ రవాణాకు వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ‘బడా బాబులు’ రంగంలోకి దిగారు. కేరళ, ముంబైలతో పాటు సిటీ యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం తరలిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో వీరే క్యారియర్లు. దుబాయ్‌లో అసలు ఆదాయపు పన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నారు. అక్కడ ఎవరైనా, ఎంతైనా బంగారం కొనొచ్చు.

విమానంలోకి తీసుకువచ్చేప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదనే ఆధారాలుంటే చాలు. స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, పౌడర్ డబ్బాలతో పాటు మొబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తరువాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి తాపడం పూసి తీసుకొచ్చారు.

తాజాగా తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో శస్త్రచికిత్సలు చేయించి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పెట్టేలా చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
 
స్మగ్లర్లకు అనేక మంది సహకారం..
కస్టమ్స్ తనిఖీల్లో బంగారం చిక్కకుండా సురక్షితంగా విమానాశ్రయం బయటి వరకు తీసుకువరావడానికి స్మగ్లర్లు అనేక మంది సహకారం తీసుకుంటున్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వారితోనూ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బంగారాన్ని బయటకు రప్పిస్తారు. కొందరు కస్టమ్స్ అధికారులు సైతం ఇదే తరహాలో స్మగ్లర్లకు సహకరిస్తున్న ఆరోపణలున్నాయి

Leave a Comment