ఆ ఇద్దరు అదుర్స్

51405021896_625x300ఆఖరి వికెట్‌కు భువీ, షమీ సెంచరీ భాగస్వామ్యం
 భారత్ తొలి ఇన్నింగ్స్ 457  
 ఇంగ్లండ్ ప్రస్తుతం 43/1
 
 భారత్ 304/4… క్రీజులో మురళీ విజయ్, ధోని… బ్రహ్మాండం, ఇక భారీ స్కోరు ఖాయం.
 భారత్ 346/9… కేవలం 42 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు… ఈ దశలో టెయిలెండర్లు భువనేశ్వర్, షమీ అద్భుతం చేశారు. ఆఖరి వికెట్‌కు ఏకంగా 111 పరుగులు జోడించి ఔరా అనిపించారు. 38.1 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి భారత్‌కు భారీ స్కోరును అందించారు.
 
 నాటింగ్‌హామ్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా… చివరి వరుస బ్యాట్స్‌మెన్ భువనేశ్వర్ (149 బంతుల్లో 58; 5 ఫోర్లు), మహ్మద్ షమీ (81 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు; 1 సిక్స్) దుమ్ము రేపే ఆటతీరును ప్రదర్శించారు. మరో వికెట్ తీస్తే చాలు.. భారత్‌ను ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయొచ్చన్న ఇంగ్లండ్ అంచనాను ఈ జోడి వమ్ము చేసింది.
 
 ఇద్దరూ అర్ధ సెంచరీలు చేసి, చివరి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఫలితంగా ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భారత్ 161 ఓవర్లలో 457 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటయ్యింది. మురళీ విజయ్ (361 బంతుల్లో 146; 25 ఫోర్లు; 1 సిక్స్), ధోని (152 బంతుల్లో 82; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్ల పతనం కొనసాగింది. మరోవైపు సెంచరీ దిశగా సాగుతున్న తరుణంలో సింగిల్ తీసేందుకు యత్నించిన ధోని.. మిడ్ ఆఫ్ నుంచి అండర్సన్ మెరుపు వేగంతో విసిరిన బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు.
 
 జడేజా (24 బంతుల్లో 25; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడినా నిలదొక్కుకోలేకపోయాడు. 346 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన దశలో భువీ, షమీ ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. అండర్సన్‌కు మూడు.. బ్రాడ్, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ గురువారం ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. తొమ్మిది పరుగుల వద్ద కుక్ (5) వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో రాబ్సన్, బ్యాలన్స్ ఉన్నారు. షమీకి ఓ వికెట్ దక్కింది.
 
 స్కోరు వివరాలు:
 భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) అండర్సన్ 146; ధావన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12; పుజారా (సి) బెల్ (బి) అండర్సన్ 38; కోహ్లి (సి) బెల్ (బి) బ్రాడ్ 1; రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32; ధోని (రనౌట్) 82; జడేజా (సి) ప్రయర్ (బి) స్టోక్స్ 25; బిన్నీ (సి) రూట్ (బి) స్టోక్స్ 1; భువనేశ్వర్ (సి) రూట్ (బి) అలీ 58; ఇషాంత్ (బి) బ్రాడ్ 1; షమీ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (161 ఓవర్లలో ఆలౌట్) 457.
 వికెట్ల పతనం: 1-33; 2-106; 3-107; 4-178; 5-304; 6-344; 7-345; 8-345; 9-346; 10-457.
 
 బౌలింగ్: అండర్సన్ 38-10-123-3; బ్రాడ్ 33-13-53-2; స్టోక్స్ 34-6-81-2; ప్లంకెట్ 37-8-88-1; అలీ 18-0-97-1; రూట్ 1-0-6-0.
 
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) షమీ 5; రాబ్సన్ బ్యాటింగ్ 20; బ్యాలన్స్ బ్యాటింగ్ 15; ఎక్స్‌ట్రాలు 3 ; మొత్తం (17 ఓవర్లలో వికెట్ నష్టానికి) 43.
 
 వికెట్ల పతనం: 1-9.
 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-12-0; షమీ 5-1-15-1; ఇషాంత్ 5-1-12-0; జడేజా 2-1-3-0; బిన్నీ 1-0-1-0.
 

Leave a Comment