లోక్‌సభలో పోలవరం బిల్లు

  • 81404852408_625x300గందరగోళం మధ్య ప్రవేశపెట్టిన హోం మంత్రి
  •  తెలంగాణ, ఒడిశా ఎంపీల ఆందోళన
ఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2014ను తీవ్ర గందరగోళం మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సోమవారమే ఎజెండాలో పెట్టినప్పటికీ రాష్ట్రపతి సిఫారసు పొందే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఆ అంశాన్ని తీసుకోవద్దని చెప్పిన హోంమంత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ అనంతరం మధ్యాహ్నం 2.10 గంటలకు బిల్లును ప్రవేశపెట్టేందుకు తీర్మానం చదివారు. దాన్ని వ్యతి రేకిస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒడిశాకు చెందిన భర్తృహరి మహతబ్ కూడా తీవ్ర అభ్యంతరాలున్నాయంటూ ప్రసంగించబోయారు. ఈ తరుణంలో హోంమంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు సభలో హోరెత్తాయి.
 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: భర్తృహరి
 బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భర్తృహరి చెప్పారు. ‘‘ఇది రూల్ 72కి విరుద్ధంగా ఉంది. విభజన బిల్లును 15వ లోక్‌సభ పూర్తి మద్దతుతో ఆమోదించింది. అయితే రాష్ట్రం మరో రెండు రోజుల్లో ఆవిర్భవిస్తుందనుకున్న తరుణంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది ఐదో షెడ్యూలు పరిధిలోకి వస్తుంది. ఐదో షెడ్యూలులో ఏమార్పు జరగాలన్నా అక్కడి ప్రజల ఆమోదం పొందాలి. ఇవేం లేకుండా తీసుకొచ్చిన ఈ బిల్లును ఉపసంహరించుకోవా లి’’అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో టీఆర్‌ఎస్ సభ్యులు ఎ.పి.జితేందర్‌రెడ్ది, కల్వకుంట్ల కవిత తదితరులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
 నేడు చర్చకు అవకాశం
 ఆర్టికల్ 3 అవసరం లేదని హోంమంత్రి సమాధానం ఇవ్వబోగా.. సభ్యుల ఆందోళన మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. ఆ గందరగోళం మధ్యే.. ఈ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు తేవాల్సి వచ్చిందో వివరిస్తూ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు, ఒడిశా ఎంపీలు ఆందోళన నిర్వహించడంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. కాగా పోలవరం బిల్లు బుధవారం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 సభాపతి స్థానంలో కొనకళ్ల..
 సాయంత్రం నాలుగున్నరకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగా టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. అయితే సభ అదుపు తప్పడంతో కొద్ది నిమిషాలకే సభను బుధవారానికి వాయిదా వేశారు.
 ఆర్డినెన్స్‌తో సరిహద్దులు మార్చలేరు
 టీఆర్‌ఎస్ సభ్యుడు వినోద్‌కుమార్
 రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం చేయాల్సిందేనని, ఆర్డినెన్స్‌లు సరిపోవని టీఆర్‌ఎస్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం ఆయా రాష్ట్రాల శాసనవ్యవస్థల అభిప్రాయాలు తెలుసుకున్నాక రాష్ట్రపతి ఈ బిల్లును పార్లమెంటుకు సిఫారసు చేయాలన్నారు. ఈ విషయంలో అలా చేయనందున బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు

 

Leave a Comment