‘గుండె’ కు గాయం…ఐనా బ్రెజిల్ సజీవం

51404590267_625x300సెమీస్‌కు చేరిన ఆతిథ్య జట్టు
 ఇక జర్మనీతో అమీతుమీ
 గాయంతో నెయ్‌మార్ ప్రపంచకప్‌కు దూరం
 
 ఒకే క్షణంలో రెండు రకాల భావోద్వేగాలు…
 ఓ వైపు గుండెల్లో చెప్పలేని బాధ… మరోవైపు పట్టరాని ఆనందం…
 ఆ ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆనంద భాష్పాలో… ఆపుకోలేని విషాదమో అర్థం కావడంలేదు… ఇదీ ఇప్పుడు బ్రెజిల్‌లో పరిస్థితి.
 
 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సొంతగడ్డపై కోటి ఆశలతో బరిలోకి దిగిన తమ జట్టు కొలంబియాను ఓడించి సెమీస్‌కు చేరిందనే సంతోషం ఓ వైపు. తమ దేశ ముద్దుబిడ్డ నెయ్‌మార్ నొప్పితో విలవిల్లాడుతుంటే తట్టుకోలేని ఆవేదన మరోవైపు. పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన. ఇక ఈ స్టార్  ఈ ప్రపంచకప్ ఆడలేడనే వార్త… సగటు బ్రెజిల్ అభిమాని గుండెను బద్దలు చేసింది.
 
 దీనికి తోడు కెప్టెన్ సిల్వా కూడా రెడ్‌కార్డ్ బారిన పడి సెమీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అందుకే… బ్రెజిల్ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతో మంగళవారం జర్మనీతో సెమీస్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఉత్కంఠ ముందు కొలంబియాపై గెలిచిన ఆనందం మరుగునపడిపోయింది.
 
 ఫోర్టలెజా: ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లందరూ ఒక్కడినే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆ ఒక్కడిని కాపాడేందుకు బ్రెజిల్ జట్టు కోచ్ స్కొలారీ పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. కొలంబియా డిఫెండర్లు నెయ్‌మార్‌ను కట్టడి చేసేందుకు చూస్తే… మిగిలిన బ్రెజిల్ ఫార్వర్డ్స్ బంతిని ఆధీనంలోకి తీసుకుని చెలరేగారు. ఫలితంగా సొంతగడ్డపై జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు బెబ్బులిలా విజృంభించింది. టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్ 2-1తో కొలంబియాపై విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

 కెప్టెన్ సిల్వ (7వ ని.), డేవిడ్ లూయిజ్ (69వ ని.) బ్రెజిల్ తరఫున గోల్స్ చేశారు. చివరి వరకు ఒంటరిపోరాటం చేసిన జేమ్స్ రొడ్రిగ్వేజ్ (80వ ని.) కొలంబియాకు ఏకైక గోల్ అందించాడు. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చేసిన రొడ్రిగ్వేజ్ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. తాజా విజయంతో 12 ఏళ్ల తర్వాత బ్రెజిల్ తొలిసారి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. లూయిజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 మ్యాచ్ ప్రారంభం నుంచి బ్రెజిల్ అటాకింగ్‌తో చెలరేగిపోయింది. 7వ నిమిషంలో నెయ్‌మార్ ఇచ్చిన కార్నర్ కిక్ బ్యాక్‌లైన్ మీద బౌన్స్ కావడంతో అక్కడే ఉన్న సిల్వ చాలా దగ్గరి నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బ్రెజిల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.
 
 గోల్ షాక్ నుంచి తేరుకున్న కొలంబియా దీటుగా స్పందించింది. 11వ నిమిషంలో కాడ్రాడో (కొలంబియా) కొట్టిన బంతిని మధ్యలోనే సిల్వ అడ్డుకున్నాడు.
 
 20వ నిమిషంలో నెయ్‌మార్, హల్క్ కలిసి బంతిని కొలంబియా పెనాల్టీ ఏరియా నుంచి నెట్‌వైపు సంధించారు. దీన్ని గోల్ కీపర్ ఒస్పినా సమర్థంగా నిలువరించాడు.

హా ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 59 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న సిల్వాసేన ఐదు ప్రయత్నాల్లో ఒక్క గోల్ సాధించింది. కొలంబియాకు రెండే అవకాశాలు వచ్చాయి.
 
 రెండో అర్ధభాగంలో కొలంబియా వ్యూహం మార్చి నెయ్‌మార్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. దీన్ని బ్రెజిల్ చక్కగా సద్వినియోగం చేసుకుంది.
 
 69వ నిమిషంలో లూయిజ్ కళ్లు చెదిరే రీతిలో కొట్టిన ఫ్రీ కిక్ బ్రెజిల్ స్కోరును డబుల్ చేసింది.
 
 ఆట మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా (80వ ని.) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కార్లోస్ బాకాను బ్రెజిల్ కీపర్ సీజర్ కిందపడేశాడు. దీంతో కొలంబియాకు పెనాల్టీ లభించింది. దీన్ని రొడ్రిగ్వేజ్ సమర్థంగా గోల్‌గా మలిచాడు.
 
 రిఫరీ కొంప ముంచాడు: రొడ్రిగ్వేజ్
 మ్యాచ్ కీలక సమయంలో స్పెయిన్ రిఫరీ కార్లోస్ వెలాస్కో కార్బెల్లో తీసుకున్న నిర్ణయాలు తమ జట్టుపై ప్రభావం చూపాయని కొలంబియా స్టార్ రొడ్రిగ్వేజ్ ఆరోపించాడు. తొలి అర్ధభాగంలో ఫెర్నాండిన్హో (బ్రెజిల్) తనను మూడుసార్లు అటాక్ చేసినా రిఫరీ పట్టించుకోలేదన్నాడు. ఓవరాల్‌గా బ్రెజిల్ ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపించాడు.
 
 ఆగని కన్నీళ్లు
 రెండో అర్ధభాగంలో బ్రెజిల్ సూపర్ స్ట్రయికర్ నెయ్‌మార్ లక్ష్యంగా కొలంబియా ఎదురుదాడులకు దిగింది. ఆట 86వ నిమిషంలో బంతి కోసం వెళ్తున్న నెయ్‌మార్‌ను కొలంబియా డిఫెండర్ కామిల్లో జునిగా వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోయి నొప్పితో విలవిలలాడుతున్న అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
 
 మూడో వెన్నుపూసలో పగులు వచ్చిందని స్కానింగ్‌లో తేలడంతో… ఆసుపత్రికి వచ్చిన అభిమానుల శ్వాస ఆగినంత పని అయ్యింది. ఈ గాయంతో నెయ్‌మార్ టోర్నీకి దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో రెండోసారి ఎల్లో కార్డుకు గురికావడంతో బ్రెజిల్ కెప్టెన్ సిల్వ… మంగళవారం జరగబోయే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.
 
 ఊహకందని అద్భుతం
 గోల్ పోస్ట్‌కు 35 గజాల దూరం… మధ్యలో నలుగురు కొలంబియా డిఫెండర్లు గోడలా నిలబడ్డారు… ఆ పక్కనే మరో ఇద్దరు ప్రత్యర్థులు ఆపడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రెజిల్ డిఫెండర్ లూయిజ్ వద్ద బంతి. సహచరుడికి పాస్ ఇస్తాడనుకుంటున్న తరుణంలో ఊహించని రీతిలో షాట్ కొట్టాడు. చిన్న పాస్‌తో మొదలుపెట్టి కుడి కాలు మడమను అమాంతం గాల్లోకి లేపి కొట్టిన ఫ్రీ కిక్ దెబ్బకు కొలంబియా గోల్ పోస్ట్ బద్దలైంది. గోల్ కీపర్ డేవిడ్ ఒస్పినా కళ్లు మూసి తెరిచేలోగా కుడివైపు కార్నర్ నుంచి బంతి నెట్‌లోకి దూసుకుపోయింది.
 

Leave a Comment