విపక్ష హోదా ఇవ్వాల్సిందే: కాంగ్రెస్

71401832505_625x300పార్టీ ఎంపీలతో సోనియా సమావేశం
 
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం లోక్‌సభలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విపక్షనేత విషయంలో సత్వరం నిర్ణయం కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని యూపీఏ ఎంపీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అనధికారిక భేటీ అని పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్‌సభలో విపక్షనేతగా తమ పార్టీ వారికే గుర్తింపునివ్వాలని సోనియా సోమవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

విపక్షనేత ఉంటే సంతోషమే: వెంకయ్యనాయుడు

లోక్‌సభ, రాజ్యసభల్లో గుర్తింపు పొందిన విపక్షనేత ఉండడం ప్రభుత్వానికి సంతోషకరమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విపక్ష నేత విషయంలో కాంగ్రెస్ తీరును ఆయన తప్పుబట్టారు. ఆ పార్టీ స్పీకర్‌కు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం విపక్ష నేత ఉండకూడదని కోరుకుంటోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కూడా మండిపడ్డారు. విపక్షనేతను గుర్తించే విషయంలో బీజేపీకి, ఎన్డీయేకు పాత్ర లేదని, ఇది పూర్తిగా స్పీకర్ అధికార పరిధిలోనిదని చెప్పారు. స్పీకర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనడం, కోర్టుకు వెళతాననడం వ్యవస్థలను కించపరచడమేనన్నారు.

రాష్ట్రపతితో సోనియా భేటీ

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాను పొందే అర్హత తమ పార్టీకి ఉందని ప్రకటించిన సోనియా గాంధీ అంతకు ముందు ఇదే అంశంపై  కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులతో చర్చించారు. ఇదిలా ఉండగా, సోనియా గాంధీ మర్యాద పూర్వకంగానే రాష్ట్రపతిని కలుసుకున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా సాధించాలన్న తన డిమాండ్‌కు ప్రజాస్వామ్యబద్ధమైన పరిష్కారం కోసం తాము అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని ఆ పార్టీ పేర్కొంది.
 

Leave a Comment