దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించాలి

71404415587_625x300హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే బడ్జెట్‌పై బీమా రంగంపై చాలా ఆశలే పెట్టుకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా జీవిత బీమా రంగం పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో ఈ బడ్జెట్ నుంచి వృద్ధి దిశగా అనేక ప్రోత్సాహకాలను ఆశిస్తోంది. బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై పన్ను మినహాయింపులను పెంచడంతో పాటు, ఏజెంట్లను ప్రోత్సహించే విధంగా టీడీఎస్ నిబంధనల్లో మార్పులు, అలాగే వ్యాపార విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వంటి అనేక అంశాలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నుంచి వరాలు వెలువడతాయని బీమా పరిశ్రమ ఎదురు చూస్తోంది. ఇప్పటికే బీమా కంపెనీల ప్రతినిధులు తమ కోర్కెల చిట్టాలను ఆర్థిక మంత్రికి సమర్పించడం ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ ఆశలు మరింత రెట్టింపయ్యాయి.

 దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను బీమా రంగం సమకూర్చగలదని, అందుకే ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ప్రసూన్ గజ్రి అంటున్నారు. బీమా వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. పొదుపు పథకాలపై పన్ను మినహాయింపులు పెంచడం, పన్ను భారం తగ్గించడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా ప్రజల్లో పొదుపు శక్తి పెరుగుతుందని తద్వారా ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడుతుందన్నారు.

 పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వైద్య బీమా ప్రీమియంపై లభిస్తున్న పన్ను మినహాయింపులను రూ.15,000 స్థాయిని  రూ.50,000 వరకు పెంచాలని బీమా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బీమా రంగ విస్తరణకు ఎఫ్‌డీఐ పరిమితి అడ్డుగా ఉండటంతో దీన్ని ప్రస్తుతం ఉన్న 26% నుంచి 49 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య కావడంతో దీన్ని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.

 సేవా పన్ను తగ్గించాలి
 జీవిత బీమా ప్రీమియంలపై విధిస్తున్న సేవాపన్నును తగ్గించాలని మాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో రాజేష్ సుద్ కోరారు. మొదటి సంవత్సరం చెల్లించే ప్రీమియంపై సేవాపన్నును మూడు శాతానికి పెంచారని, దీన్ని తగ్గించాలన్నారు. అలాగే ఏజెంట్ల కమీషన్లపై విధిస్తున్న టీడీఎస్ పరిమితిని కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏడాదిలో ఏజెంట్ కమీషన్ రూ.20,000 దాటితే టీడీఎస్‌ను విధిస్తున్నారని, ఈ పరిమితిని కనీసం రూ.50,000కు పెంచాలన్నారు.

Leave a Comment