పట్టాలు తప్పిన ‘రాజధాని’

Rajdhani Expressబీహార్‌లో దుర్ఘటన  నలుగురి మృతి, 23 మందికి గాయాలు

చాప్రా/పాట్నా: బీహార్‌లో బుధవారం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతిచెందగా, 23 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ వెళ్తున్న ఈ రైలు సరణ్ జిల్లా చాప్రా సమీపంలోని గోల్డెన్‌గంజ్ స్టేషన్ వద్ద వేకువజామున  2.11 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ స్టేషన్ పాట్నాకు 75 కి.మీ దూరంలో ఉంది. దుర్ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పగా వీటిలో ఐదు బోల్తాపడ్డాయి. వీటిలో కొన్ని బోగీలు 700 అడుగుల దూరం ఎగిరిపడ్డాయి. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రులకు తరలించారు. బీ-2 బోగీ నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను పంజాబ్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సరణ్, చంపారన్ జిల్లాల్లో భద్రతా బలగాల ఆపరేషన్లకు నిరసనగా నక్సల్స్ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

నక్సల్స్‌ను నిందించడం తొందరపాటు: కేంద్రం

ఈ దుర్ఘటన వెనుక మావోయిస్టుల హస్తముందా లేదా అనే దానిపై వివాదం రేగింది. ప్రమాద స్థలానికి 60 కి.మీ దూరంలోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో మంగళవారం రాత్రి ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పిన గూడ్సు ప్రమాదానికి నక్సల్సే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌లోని తీర్హుత్, సరణ్ జిల్లాల్లో రైల్వే ఆస్తులకు మావోయిస్టులు  నష్టం కలిగించే అవకాశాలున్నాయని నిఘావర్గాలుఇటీవల హెచ్చరించాయి. రైల్వే బోర్డు అధికారులు కుట్రకోణాన్ని గురించి మాట్లాడుతుంటే, కేంద్ర హోం, రైల్వే మంత్రులు మాత్రం తొందరపడి నిర్ణయానికి రాలేమని అంటున్నారు.  ‘రాజధాని’ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ, సహాయ మంత్రి మనోజ్ సిన్హాలు పరిశీలించారు. విద్రోహ కోణంపై దర్యాప్తు చేస్తామని గౌడ చెప్పారు. దుర్ఘటనకు ముందు పట్టాలపై పేలుడు సంభవించిందని, దాని వల్లే రైలు పట్టాలు తప్పి ఉండొచ్చని  రైల్వే బోర్డు చైర్మన్ అనురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ‘రాజధాని’ రావడానికి 15 నిమిషాల ముందు కవిగురు ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో సురక్షితంగా వెళ్లిందని సరణ్ జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. ప్రమాదానికి గురైన రైలుకు ముందు ముందు జాగ్రత్తగా పైలట్ ఇంజన్‌ను నడపకపోవడంపై రైల్వే పోలీసులు, తూర్పుమధ్య రైల్వే అధికారులు నిందించుకున్నారు.  మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 2 లక్షల చొప్పున, ప్రధాని రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రధాని, కేబినెట్ సంతాపం

ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రమాదంపై కేంద్ర కేబినెట్ విచారం వ్యక్తం చేసింది. విద్రోహ కోణంపై చర్చించి, ఆందోళన వ్యక్తం చేసింది. భేటీలో మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

Leave a Comment