‘పోలవరం’ పై రాజ్యసభలో ఎవరేమన్నారు?

Rajya Sabhaన్యూఢిల్లీ: రాజ్యసభలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు, ముంపు గ్రామాలు ఏపిలో కలిపే అంశంపై సుదీర్ఘ చర్చ – రచ్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో ముంపునకు గురైయ్యే గ్రామాలను ఏపిలో కలిపేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ సవరణ బిల్లును కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రాజ్యసభలో  ప్రవేశపెట్టినప్పుడు వివిధ పార్టీల సభ్యులు తమతమ అభిప్రాయలను తెలిపారు. పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కెకె తీర్మానం వీగిపోయింది. బిల్లు సభ ఆమోదం పొందింది.

ఈ బిల్లుపై రాజ్యసభ సభ్యుల అభిప్రాయాలు:

* పోలవరం  ప్రాజెక్టు పూర్వాపరాలు పరిశీలించిన తరువాతే ఆమోదించాం. ఈ ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. 1958లో ముంపు ప్రాంతాలు ఆంధ్రలోనే ఉండేవి.  ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే బిల్లును తీసుకువచ్చాం. పోలవరంపై ఎటువంటి ఆందోళనలు వద్దు.
-కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్
ఎన్నో ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతోంది.  పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాం. పోలవరం వల్ల 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ ప్రజలకు కూడా పునరావాసం కల్పించాలి. 45వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలి.  అప్పట్లో ఎన్నికలో కోడ్ వల్ల ఆర్డినెన్స్‌ జారీచేయలేకపోయాం. పోలవరం డిజైన్ మార్చే అవకాశం ఇప్పుడు లేదు. కేబినెట్‌లో చర్చించాకే ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలని నిర్ణయించాం. దీనిపై అప్పటి ప్రధాని రాజ్యసభలో వివరణ ఇచ్చారు. పోలవరం డిజైన్‌ను కేంద్ర జలసంఘం ఆమోదించింది. తెలంగాణ ఎంపీలు సమస్యను అర్ధం చేసుకోవాలి. ఏపీ అభివృద్ధి పోలవరంతో ముడిపడివుంది. ఇది బహుళార్ధసాధక ప్రాజెక్టు. నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం. ఏపి పునర్వవస్థీకరణ సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
– మాజీ మంత్రి జైరామ్ రమేష్
అన్ని రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి. కొత్త భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి.
– సిపిఐ సభ్యుడు డి.రాజా
జాతీయ ప్రాజెక్టు. దీని వల్ల పారిశ్రామిక అవసరాలు తీరతాయి. ఎందరికో లబ్ది చేకూరుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాలోని భూముల సాగుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పోలవరం బిల్లు తీసుకొచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు.
– కాంగ్రెస్ సభ్యుడు చిరంజీవి
పోలవరం ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. పోలవరం బిల్లుకు వ్యతిరేకం.  పోలవరం డిజైన్ మార్చాలి.
-టిఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు

1956కు ముందు భద్రాచలం డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగం. భద్రాచలం టౌన్‌ను ఏపీకి కేటాయించాలి.
– కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు
ముంపు బాధితులకు పూర్తి న్యాయం జరగాలి. – కాంగ్రెస్ సభ్యురాలు  రేణుకాచౌదరి
పోలవరం డిజైన్‌ మార్చాలని కోరుతున్నాం. రాజ్‌నాథ్‌ సింగ్ ముంపు ప్రాంతాలను సందర్శించాలి.
– కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు
పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ నేతలు సహకరించాలి. ఎలాంటి సవరణలు లేకుండా గత ప్రభుత్వ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలి. పోలవరం వల్ల గోదావరి జిల్లాలు  సస్యశామలం అవుతాయి.
-కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం
రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా బిల్లు ఎలా తెస్తారు. – కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి
పోలవరం డెవలప్‌మెంట్‌ అధారిటీని ఏర్పాటు చేయాలి. – టిడిపి సభ్యుడు సీఎం రమేశ్

Leave a Comment