అసమాన ప్రతిభా సంపన్నుడు

81404410024_625x300సంక్షిప్తంగా… బెంజమిన్ ఫ్రాంక్లిన్
 
జూలై 4 ఇవాళ. అమెరికా స్వాతంత్య్ర దినం. ఈ సందర్భంగా మనం… చెప్పుకుంటే అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ గురించి చెప్పుకోవాలి. లేదంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి చెప్పుకోవాలి. ఇద్దరూ అమెరికా పుట్టక ముందు పుట్టినవారే. ఇద్దరూ అమెరికా స్వాతంత్య్ర సమరం లో భాగస్వాములైన వారే. అమెరికా వలసల తిరుగుబాటు దళం ‘కాంటినెంటల్ ఆర్మీ’ దళపతి జార్జి వాషింగ్టన్.

అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇద్దరూ ఒకరి కన్నా ఒకరు ఎక్కువౌతారేమో కానీ, ఈ ఇద్దరిలో ఎవరూ ఒకరి కన్నా ఒకరు తక్కువ కారు. అయితే ఒక్క విషయంలో మాత్రం బెంజమిన్.. వాషింగ్టన్ కన్న ఎక్కువ. వయసులో దాదాపు పాతికేళ్లు సీనియర్. ఈ ఒక్క పాయింట్‌ని పరిగణనలోకి తీసుకుంటే గనుక మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి స్వేచ్ఛగా, సంశయ రహితంగా మాట్లాడుకోవచ్చు.  
 
అమెరికాలో మొదట పదమూడు రాష్ట్రాలు ఉన్నట్లు, ఫ్రాంక్లిన్‌లో పదమూడు గొప్పదనాలు ఉండేవని ఆయన సమకాలీనులు అంటుండేవారు. శాస్త్రవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు.. ఒక్క మాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే ఫ్రాంక్లిన్ ఆ ఒక్కమాటా ఒప్పుకునేవారు కాదు. కష్టపడి పనిచెయ్యడం తప్ప తనకింకేమీ తెలియదని చెప్పుకున్నారాయన!
 
బెంజమిన్ ఫ్రాంక్లిన్ బోస్టన్‌లో పుట్టారు. ఫిలడెల్ఫియాలో మరణించారు. ఈ మధ్య వ్యవధిలో సాగిన ఆయన జీవితం 1706-1790 మధ్య ఉన్న నిడివి కన్నా చాలా పెద్దది. అంటే, రోజులు, నెలలు, సంవత్సరాలలో ఇమిడిపోని విస్తృత జీవితం ఆయనది. ఒకే మనిషిగా వంద పనులు చేశారు. స్వాతంత్య్రం కోసం అమెరికా నొప్పులు పడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. స్వాతంత్య్ర ప్రకటన తీర్మాన రచనలో తన చెయ్యీ వేశారు. ఈ రెండు సందర్భాలూ ఫ్రాంక్లిన్ జీవితంలో కీలకమైనవి.
 
ఫ్రాంక్లిన్ పదిహేడేళ్ల వయసులో బోస్టన్ వదిలి ఫిలడెల్ఫియా వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ లండన్ వెళ్లి ముద్రణలో శిక్షణ పొందారు. తిరిగి ఫిలడెల్ఫియా వచ్చి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. తర్వాత పెళ్లి, పిల్లలు. ఆ తర్వాత పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం. విద్యుత్‌పై ప్రయోగాలు. తర్వాత పెన్సిల్వేనియా అసెంబ్లీకి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తర్వాత ఐదేళ్లకు అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ అధ్యక్షుడయ్యారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే ఫ్రాన్సుకు అమెరికన్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. క్లుప్తంగా ఇదీ బెంజమిన్ బయోగ్రఫీ.

పన్నుల విధింపునకు ఫ్రాంక్లిన్ బద్ధ వ్యతిరేకి. పన్నులు కట్టేవారే. కానీ, బాధపడుతూ కట్టేవారు. పన్నుల మీద సెటైర్లు విసిరేవారు. ‘‘మనిషి కోసం రెండు రాసి పెట్టి ఉంటాడు దేవుడు. ఒకటి మరణం. ఇంకోటి ‘పన్నులు’. ఈ రెండూ మనిషి జీవితానికి తప్పనిసరి. నువ్వెలా బతికినా చివరికి చనిపోవాల్సిందే. నువ్వెలా బతుకుతున్నా… చచ్చినట్లు పన్నులు కట్టాల్సిందే. తిన్నా, తినకున్నా కక్కాల్సిందే!’’ అంటారాయన. జీవితాన్ని తేలిగ్గా తీసుకుని సీరియస్‌గా గడిపిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్.

Leave a Comment