జీవితఖైదీలను విడుదల చేయొద్దు: సుప్రీం

81400873935_625x300న్యూఢిల్లీ: వివిధ జైళ్లలో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఇతర కేంద్ర సంస్థలు వాదించిన కేసుల్లో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్నవారిని విడుదల చేసేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా? లేదా? అన్నదానిపై జూలై 18 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22న జరిగేంతవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయంది. మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులకు శిక్ష తగ్గించాలన్న తమిళనాడు ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తోంది.
 

Leave a Comment