మెస్సీ x ముగ్గురు

61404848282_625x300అర్జెంటీనా బలం మెస్సీ. ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవడం… తను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో సూచిస్తోంది. దాదాపు ప్రతి ప్రత్యర్థి జట్టూ తన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కానీ మెస్సీ తెలివిగా సహచరులకు అవకాశాలు సృష్టిస్తూ జట్టును గెలిపిస్తున్నాడు. ఈసారి ప్రత్యర్థి నెదర్లాండ్స్. ఆ జట్టు కోచ్ వాన్ గాల్ వ్యూహాలు పన్నడంలో దిట్ట. మరి మెస్సీ ఏం చేస్తాడో..?
 ఒక జట్టులో సాధారణంగా ఒక స్టార్ ఆటగాడు ఉంటాడు. కానీ నెదర్లాండ్స్ జట్టులో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. రాబెన్, వాన్ పెర్సీ, స్నైడర్… ముగ్గురూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒకరు తడబడితే మరొకరు బంతిని అందుకుంటున్నారు. నిజానికి ఇది ప్రత్యర్థులు ఊహించని పరిణామం. అందుకే ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మెస్సీకి, ఆ ముగ్గురికి మధ్య పోరుగా అభివర్ణించాలి.
 
 సావో పాలో: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నెదర్లాండ్స్… 24 ఏళ్లుగా ఊరిస్తున్న టైటిల్ వైపు ఆశగా అర్జెంటీనా… ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌కు సిద్ధమయ్యాయి.
 
 ఈ టోర్నీలో ఎక్కువగా ఆకట్టుకున్న జట్టేదైనా ఉందంటే అది నెదర్లాండ్సే. ఆధిక్యం కోల్పోయినా… ఏ దశలోనూ మ్యాచ్‌పై ఆశలు వదులుకోని నైజం ఆ జట్టు సొంతం.
 
 లీగ్ దశలో స్పెయిన్, ఆస్ట్రేలియా జట్లతో… ప్రిక్వార్టర్ ఫైనల్లో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లే దీనికి మంచి ఉదాహరణ. నెదర్లాండ్స్ జట్టు ఏ క్షణంలోనైనా అనూహ్యంగా తేరుకుంటుందని ఈ మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన నిరూపించింది.
 
 అర్జెన్ రాబెన్, రాబిన్ వాన్ పెర్సీ, వెస్లీ స్నైడర్, డిర్క్ క్యుట్, హంటెలార్, లెరాయ్ ఫెర్, డెపె మెంఫిస్, డేలీ బ్లైండ్ తదితరులు సమష్టిగా రాణిస్తున్నారు. మొత్తానికి నెదర్లాండ్స్ ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడలేదు.
 
 ఇక కోచ్ లూయిస్ వాన్ గాల్ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ప్రపంచకప్ తర్వాత విఖ్యాత క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్ జట్టు కోచ్‌గా వెళ్లనున్న వాన్ గాల్ ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోనూ తమ జట్టుకు అనుకూల ఫలితాలు వచ్చేలా వ్యూహాలు రచించారు.
 
 మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కీలకదశలో కెప్టెన్ వాన్ పెర్సీని తప్పించి హంటెలార్‌ను… మరో ప్లేయర్ మెంఫిస్‌ను సబ్‌స్టిట్యూట్‌లుగా వాన్ గాల్ బరిలోకి దించారు. ఆ ఇద్దరూ ఒక్కో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు.
 
 ఇక కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అదనపు సమయంలోని చివరి క్షణాల్లో రెగ్యులర్ గోల్‌కీపర్ స్థానంలో రెండో గోల్ కీపర్ టిమ్ క్రూల్‌ను బరిలోకి దించారు. చివరకు క్రూల్ ‘షూటౌట్’లో రెండు షాట్స్‌ను నిలువరించి నెదర్లాండ్స్‌ను సెమీస్‌కు చేర్చాడు.
 
 కేవలం లియోనెల్ మెస్సీ విన్యాసాలపైనే ఎక్కువగా ఆధారపడిన అర్జెంటీనా కీలకపోరులో ‘ఆరెంజ్’ను ఏ రేంజ్‌లో అడ్డుకుంటుందో చూడాలి. ప్రత్యర్థి జట్లు మెస్సీని నిలువరించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నా… అతను మాత్రం అద్వితీయ ఆటతీరుతో ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ, సహచరులకు గోల్ చేసే అవకాశాలను సృష్టిస్తున్నాడు.
 
 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏకైక గోల్‌తో అర్జెంటీనాను గెలిపించిన డి మారియో తొడ గాయంతో సెమీఫైనల్‌కు దూరమవ్వడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్టంగా ఉన్న నెదర్లాండ్స్‌ను ఓడించాలంటే కేవలం మెస్సీనే కాకుండా ఇతర సభ్యులు శక్తి మేరా రాణించాలి.
 
 విశేషాలు
 ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా జట్టు ఇప్పటివరకు సెమీఫైనల్స్‌లో ఏనాడూ ఓడిపోలేదు. సెమీఫైనల్‌కు చేరుకున్న నాలుగు పర్యాయాల్లో అర్జెంటీనా రెండుసార్లు విజేతగా (1978లో, 1986లో) నిలిచింది. మరో రెండుసార్లు రన్నరప్‌గా (1930లో, 1990లో) నిలిచింది.
 
 1978 ప్రపంచకప్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించిన తర్వాత అర్జెంటీనా మరోసారి డచ్ జట్టుపై గెలువలేదు. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి నెదర్లాండ్స్, అర్జెంటీనా ముఖాముఖి పోరులో తలపడుతున్నాయి.
 
 అర్జెంటీనా, ఆతిథ్య జట్టు బ్రెజిల్ ఏకకాలంలో ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.
 
 అర్జెంటీనా స్టార్ మెస్సీ ఈ ప్రపంచకప్‌లో అందరికంటే ఎక్కువగా 19 సార్లు తన సహచరులకు గోల్ చేసే అవకాశాలను సృష్టించాడు.
 
 పెనాల్టీ షూటౌట్‌లను మినహాయిస్తే గత 16 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. 12 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
 
 ప్రస్తుత టోర్నీలో అర్జెంటీనా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లపై ఒక గోల్ తేడాతో గెలుపొందడం విశేషం. అంతేకాకుండా ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ అర్జెంటీనాయే తొలుత ఖాతా తెరిచింది.
 
 తాము బరిలోకి దిగిన గత నాలుగు ప్రపంచకప్‌లలో నెదర్లాండ్స్ మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది.
 
 దక్షిణ అమెరికా జట్లతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే (షూటౌట్‌లను మినహాయిస్తే) నెదర్లాండ్స్ ఓడిపోయింది.
 
 కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తమ జట్టు చరిత్రలోనే తొలిసారి అత్యధికంగా 692 పాస్‌లు పూర్తి చేసింది.
 
 ఈ టోర్నీలో నెదర్లాండ్స్ చేసిన 12 గోల్స్‌లో 10 గోల్స్ ద్వితీయార్ధ భాగంలో రావడం విశేషం. అంతేకాకుండా నెదర్లాండ్స్ తరఫున ఏడుగురు వేర్వేరు క్రీడాకారులు గోల్స్ చేశారు. ఈ టోర్నీలో ఏ జట్టు తరఫున ఇలా జరుగలేదు.
 

Leave a Comment