ఫుల్‌గా మద్యం ఆదాయం…

  • 61393104199_625x300వైన్‌షాపుల లెసైన్సుల ద్వారా రూ.22 కోట్లు పెరిగిన ఆదాయం
  • షాపుల కేటాయింపుల ద్వారా రూ.224 కోట్లు..

సాక్షి, విజయవాడ : జిల్లాలో ఎక్సైజ్ శాఖకు మద్యం షాపుల కేటాయింపుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. గత వార్షిక లెసైన్సు ఫీజుతో పోలిస్తే ఈ ఎడాది అదనంగా రూ.22 కోట్లు ఆదాయం పెరిగింది. షాపుల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం పెరిగితే, దరఖాస్తుల విక్రయాల ద్వారా సుమారు రూ.10 కోట్లు ఆదాయం పెరిగింది. ఈ ఎడాది మద్యం పాలసీలో లెసైన్సు ఫీజు పట్టణాల్లోని షాపులకు పెంచడం వల్ల అదనపు ఆదాయం సమకూరింది.

ఈ ఆదాయం మరికొంత పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల ఎక్సైజ్ శాఖలో కాసులు కురిశాయి. జిల్లాలో 335 వైన్‌షాపులు, 167 బార్లు ఉన్నాయి. వీటిలో మొదటి ఎక్సైజ్ గెజిట్ ద్వారా డ్రా నిర్వహించి  282 షాపులు కేటాయించారు. ఈ షాపు లెసైన్స్ ఫీజుల ద్వారా రెండేళ్లకు కలిపి రూ.224 కోట్లు లభించాయి. మిగిలిన 53 షాపుల ద్వారా సుమారు రూ.20 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరో 165 బార్ల లెసైన్సులను రెన్యూవల్ చేశారు.
 
 రెండో గెజిట్ ద్వారా రూ.4కోట్లు
 రెండో గెజిట్ ద్వారా విజయవాడ డివిజన్‌లో ఖాళీగా ఉన్న 20 షాపులకు గానూ 10 షాపులను ఖరారు చేశారు. ఈ షాపుల ద్వారా సుమారు రూ.4కోట్లు సమకూరాయి. మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఖాళీగా మిగిలిన 33 షాపుల్లో 8 షాపులు కేటాయించారు. మూడో నోటిఫికేషన్ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
 
 షాపుల శ్లాబ్ ఇలా..
 = జిల్లాలో అత్యధికంగా నగర ప్రాంతాల్లో ఉన్న షాపులకు రూ.64 లక్షలు శ్లాబ్ ధరగా ప్రభుత్వం నిర్ణయించింది.
 
 = మున్సిపాలిటీల్లో ఉన్న షాపులకు రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులు రూ.36 లక్షలు, రూ.32లక్షలు శ్లాబ్‌గా నిర్ణయించారు.
 
 = ఈ క్రమంలో రూ.64 లక్షల శ్లాబ్‌లో 55 షాపులు ఉన్నాయి. వాటిలో 46 షాపులు డ్రాలో వ్యాపారులు దక్కించుకున్నారు.
 
 = రూ.45 లక్షల శ్లాబ్‌లో 28 షాపులు ఉండగా వాటిలో 27 షాపులు, రూ.36లక్షల శ్లాబ్‌లో 122 షాపులు ఉండగా, 118 కేటాయించారు. రూ.32.5 లక్షల శ్లాబ్‌లో 130 షాపులు ఉండగా 108 షాపుల కేటాయింపు పూర్తయింది.
 
 = రూ.41 లక్షల శ్లాబ్‌లో 128 బార్లు ఉండగా వాటిలో 126 రెన్యూవల్స్ పూర్తయ్యాయి. రూ.64 లక్షల శ్లాబ్‌లో ఉన్న 39 బారుల రెన్యూవల్స్‌పూర్తి చేశారు.
 
 = 2012-14 వార్షిక లెసైన్స్ సంవత్సరంలో 335 షాపులకు గానూ 300 షాపులు మాత్రమే కేటాయించారు. మిగిలిన 35 షాపులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో రెండేళ్ల కాలపరిమితిలో ఉన్న లెసైన్సు ఫీజు ద్వారా రూ.212 కోట్లు ఆదాయం వచ్చింది.
 
 = ఈ ఎడాది ఆ మొత్తాన్ని మొదటి నోటిఫికేషన్ ద్వారానే అధిగమించారు. మొత్తం 335 షాపుల ద్వారా రెండేళ్లకు రూ.244 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అచనా వేశారు.
 
 దరఖాస్తుల ద్వారా రూ.9.90 కోట్లు…
 వైన్‌షాపుల కేటాయింపులకు సంబం ధించిన దరఖాస్తులను విక్రయించటం ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ప్రధానంగా ప్రతి దరఖాస్తుకు రూ.25 వేలు నాన్ రిఫండబుల్ మొత్తాన్ని రుసుముగా నిర్ణయించారు. దీంతో జిల్లాలో దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.9.90 కోట్లు ఆదాయం లభించింది. మొదటి నోటిఫికేషన్ ద్వారా సుమారు 4,800 దరఖాస్తులు విక్రయించారు. రెండో గెజిట్‌లో మొత్తం సింగిల్ దరఖాస్తులో కావడంతో ఎక్కువ విక్రయించలేదు. విజయవాడ డివిజన్‌లో రెండో గెజిట్ ద్వారా 20 షాపుల్లో 10 షాపులను సింగల్ దరఖాస్తులే వచ్చాయి.
 

Leave a Comment