తడిసిన ముంబై.. ఆగిన ట్రాఫిక్

81404298357_625x300ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం సహా.. పశ్చిమ మహారాష్ట్ర, ఇతర తీరప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాలు దాదాపు మూడు వారాలు ఆలస్యమైనా.. బుధవారం మాత్రం ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్ల రాకపోకలపై కూడా వర్షం ప్రభావం గట్టిగానే పడింది. లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీట మునిగిపోయాయి.

ముంబై పశ్చిమ ప్రాంతంలోని ఎస్వీ రోడ్డు లాంటి చోట్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్ లాంటి మార్గాల్లో సబర్బన్ రైళ్లు కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి. ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ వేలలో కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని, ఇవి మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వీకే రాజీవ్ తెలిపారు.

ముంబైతో పాటు మహారాష్ట్రలోని థానె, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, నాసిక్, అహ్మద్ నగర్, సతారా జిల్లాల్లో కూడా భారీగానే వర్షాలు కురిశాయి. మధ్యాహ్నానికి ముంబై నగరంలో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నీటిసరఫరాలో కోత విధించాలన్న యోచనను గ్రేటర్ ముంబై కార్పొరేషన్ తాత్కాలికంగా విరమించుకుంది

Leave a Comment