టెస్టుకు ముందు పరీక్ష!

England Test series– మరో ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత్ సిద్ధం
– నేటినుంచి డెర్బీషైర్‌తో పోరు

డెర్బీషైర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జట్టు బలాబలాలను అంచనా వేసేందుకు భారత జట్టుకు ఇదే చివరి అవకాశం. మంగళవారంనుంచి ఇక్కడ జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్, డెర్బీషైర్‌తో తలపడుతుంది. ఈ మూడు రోజుల మ్యాచ్‌కు ఫస్ట్‌క్లాస్ గుర్తింపు లేకపోవడంతో భారత్ అందుబాటులో ఉన్న 18 మంది ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది.

గత మ్యాచ్‌నుంచి పెద్దగా ప్రయోజనం పొందని టీమిండియా ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. మరో వైపు ప్రత్యర్థి డెర్బీషైర్ పెద్దగా బలంగా ఏమీ లేదు. ఈ జట్టు కూడా తమ దేశవాళీలో వరుసగా విఫలమవుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం భారత్‌ను ఇబ్బంది పెట్టే అంశం.
 
బౌలింగే కీలకం
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆకట్టుకున్నా…బౌలింగ్ ఎప్పటిలాగే బలహీనంగా కనిపించింది. ధావన్, గంభీర్, పుజారా, రహానే, రోహిత్…ఇలా అంతా గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. అయితే రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు అవకాశాలు మెరుగు పడాలంటే ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలింగ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోని తన బౌలింగ్ వనరులను పూర్తిగా ఉపయోగించడంపై దృష్టి పెట్టాడు.

గత మ్యాచ్‌లో విఫలమైన ఇషాంత్ శర్మను మినహాయిస్తే జట్టులో ఐదుగురు ప్రధాన పేసర్లు ఉన్నారు. వీరిలో ఎంతో కొంత అంతర్జాతీయ అనుభవం ఉన్న మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఆరోన్‌లు ఈ మ్యాచ్‌లో రాణించడాన్ని బట్టి టెస్టు జట్టు కూర్పును నిర్ణయించవచ్చు. ఇక ఈశ్వర్ పాండే, పంకజ్ సింగ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

Leave a Comment