విమానాల అడ్డాగా ఆదిభట్ల

81404518166_625x300 (1)ఓడలు బండ్లవుతై.. బండ్లు ఓడలైతై’ అనే సామెత ఆదిభట్ల గ్రామానికి సరిగ్గా నప్పుతుంది. ఐదేళ్ల క్రితం వరకూ అదో కుగ్రామం. షేరాటోలు కూడా సరిగా తిరగని ఆ ఊళ్లో నేడు ఏకంగా విమానాల విడిభాగాలనే తయారు చేస్తున్నారు.

ఇప్పటికే ఐటీఐఆర్ గుర్తింపుతో ఆదిభట్లకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలకు.. ఏరోస్పేస్ సెజ్ కూడా తోడవడంతో విమాన కంపెనీలూ పరుగులు పెడుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటే నివాస, వాణిజ్య నిర్మాణాలు, ఐటీ, ఏరోస్పేస్ సంస్థల కార్యాలయాలు, విశాలమైన రోడ్లు.. ఇలా పూర్తిస్థాయి హైటెక్ జోన్‌గా రూపుదిద్దుకోనున్న ఆదిభట్ల గ్రామంపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం.

 సాక్షి, హైదరాబాద్: గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి రూపురేఖలే మారిపోయాయి. ఇప్పటికే ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సమూహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

 తాజాగా టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ సంస్థ జర్మనీకి చెందిన రుమాగా సంస్థతో కలిసి డార్నియర్ విమాన పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించింది. డార్నియర్-228 విమాన ప్రధాన భాగంతో పాటు విమాన రెక్కలను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు. రెండో దశలో మొత్తం విమానాన్నే తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోనే తొలి విమాన తయారీ కేంద్రంగా ఆదిభట్ల ప్రపంచ చరిత్రలో నిలుస్తుందన్నమాట.

 ఐటీ కంపెనీలకూ బూస్ట్..
 ఆదిభట్లలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రభుత్వం భూములను కేటాయించింది. అందులో ఏరోస్పేస్ సంస్థలకు కొంత భూమిని కేటాయించగా.. మిగిలిన 180 ఎకరాల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు భూములను కేటాయించింది. దీనికితోడు ఆదిభట్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా కూడా కేంద్రం ప్రకటించింది.

 క్లస్టర్ -2లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం)లలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. దీంతో ఎంఏటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎన్‌ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎన్‌కేఎం టెక్నాలజీ వంటి కంపెనీలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న టీసీఎస్‌లో సుమారు 50 ఐటీ సంస్థల భవనాలను నిర్మిస్తున్నారు. ఐటీఐఆర్, ఏరోస్పేస్ సెజ్‌లు, కారిడార్లతో ఆదిభట్లకు లక్షకు పైచిలుకు ఉద్యోగాలొస్తారని నిపుణులు చెబుతున్నారు.

 భగ్గుమంటున్న ధరలు..
 ఏడేళ్ల క్రితం ఆదిభట్లలో ఎకరం భూమి రూ.50 వేలకు మించి లేదు. కానీ, ప్రస్తుతం ఐటీ, ఏరోస్పేస్  కంపెనీలు రావడంతో ఆదిభట్ల, బొంగ్లూరు, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, నాదర్‌గుల్, మమ్మరాజుగూడెం గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆదిభట్ల, బొంగ్లూరు గ్రామాల్లో ఎకరానికి రెండు కోట్ల వరకూ పలుకుతోంది. మెట్రోసిటీ డెవలపర్స్ సంస్థ బొంగ్లూరులో 36 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది.
గజానికి రూ.4,500లుగా ఉందని సంస్థ ఎండీ కే. మనోహర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఆదిభట్లలోని టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్ సంస్థను ఆనుకొని ‘ఏరో ఎన్‌క్లేవ్-2’ పేరుతో మరో 10 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో గజం ధర రూ.8 వేలుగా ఉంది. ఆదిభట్ల నుంచి కి.మీ. దూరంలో ఉన్న మమ్మరాజుగూడెంలో వచ్చే నెలలో 14 ఎకరాల్లో మరో భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. గజం ధర రూ.5-రూ.6 వేలుగా ఉంటుందని చెప్పారు

Leave a Comment