అంతా సచిన్ పుణ్యమే…

 41404763100_625x300జోక్యంతోనే సారథినయ్యా
ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా  ఎంఎస్ ధోని వ్యాఖ్య
నాటింగ్‌హామ్: ఎంఎస్ ధోని… భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు.. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలను గత ఏడేళ్లుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మోస్తున్న మిస్టర్ కూల్. జట్టును టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే కాకుండా టి20,  వన్డే ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించి అభిమానులను అలరించిన నాయకుడు.

అయితే ఇన్ని విజయాలకు కారణం మైదానంలో అత్యంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడమే కారణమని ధోని చెబుతున్నాడు. ప్రస్తుత స్థానం గురించి తనకే ఆశ్చర్యంగా ఉందని, వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న తాను సచిన్ టెండూల్కర్ జోక్యంతోనే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టగలిగానని చెప్పుకొచ్చాడు. ఆదివారం 33వ పుట్టిన రోజు జరుపుకున్న ధోని ఓ ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే….
 
నేనేదీ ప్లాన్ చేసుకోను: వాస్తవానికి నేను ఏ విషయం గురించి ముందుగా ప్రణాళికలు రచించను. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకముంటుంది. చాలామందికి ఈ విషయంలో తమ గురించి తమకు సరైన పరిజ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా ఆడిన అన్ని రకాల క్రికెట్ కారణంగానే కాకుండా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల వల్లే నాకీ స్వభావం వచ్చింది.
 
సీనియర్ల సలహాలు విన్నాను: సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీలాంటి దిగ్గజాలున్న జట్టుకు నేను నాయకత్వం వహించాను. అయితే ఆ సమయంలో నేను వారి అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. వారిచ్చే సలహాలను స్వీకరించాను. ఒకవేళ వారు చెప్పిన దాంతో విభేదిస్తే అప్పుడే వారికి ఆ విషయం చెప్పేవాణ్ణి. దీన్ని వారు కూడా అంగీకరించి కొద్ది సేపటికి మరో ఐడియాతో వచ్చి నిర్ణయాన్ని నాకు వదిలేసేవారు. ఇది నిజంగా వారి గొప్పతనం. నా నిజాయతీ, ముక్కుసూటి తనం నచ్చడం వల్లే వారు నాకు సహకరించగలిగారు.
 
అంతా టెండూల్కర్ చలవే: నేను కెప్టెన్‌గా అయిన క్షణం చాలా ఆశ్చర్యపోయా. అసలు నేను ఏనాడూ ఆ లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అంతకుముందు నేను సచిన్‌తో మాట్లాడిన తీరు వల్లే ఈ అవకాశం వచ్చి ఉండొచ్చు. బౌలింగ్‌లో సచిన్ చాలా వైవిధ్యమైన బంతులు వేయగలడు. అతడు బంతి తీసుకున్నప్పుడల్లా నా దగ్గరకు వచ్చి బ్యాట్స్‌మన్‌కు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, సీమ్ అప్‌లో ఎలాంటి బంతులు వేయాలి? అని అడిగేవాడు. నేనిచ్చిన సూచనల మేరకు… ఇతడు ఆటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని సచిన్ భావించి ఉంటాడు.

రిటైరయ్యాక అదే పని చేస్తా:
 మ్యాచ్ గెలిచిన ప్రతీసారి స్టంప్‌ను తీసుకోవడం నాకు అలవాటు. ఓడిన మ్యాచ్ విషయంలో ఇది పట్టించుకోను. నేను ఆట నుంచి తప్పుకున్నాక నా మ్యాచ్‌ల వీడియోలన్నింటినీ చూస్తాను. స్టంప్స్ మీదున్న స్పాన్సర్ లోగోలను నిశితంగా పరీక్షిస్తే అది ఏ మ్యాచ్‌కు సంబంధించిన స్టంప్ అనేది తెలిసిపోతుంది. రిటైరయ్యాక ఇదే నా టైమ్ పాస్.

Leave a Comment