చైనా కూడా సిద్ధంగా ఉంది!

51404674499_625x300ఆట పది దేశాలకే పరిమితం కారాదు
  కొత్త జట్లపై ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ పది దేశాలకే పరిమితం కారాదని, ఆసక్తి ఉన్న అన్ని దేశాలనూ ఆటలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని ఐసీసీ తొలి చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ అన్నారు. చైనా కూడా ఇందుకు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ‘టెస్టు క్రికెట్ పది మందికే పరిమితమైన క్లబ్‌లాగా ఉండరాదు.
 
 అవకాశం ఉన్న ప్రతీ దేశంలో ఆటను అభివృద్ధి చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఏసీసీ సభ్య దేశమైన చైనా కూడా ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఇతర క్రీడలపై దృష్టి సారిస్తున్నా… ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తే తామూ క్రికెట్‌లోకి పూర్తి స్థాయిలో అడుగు పెడతామని వారు స్పష్టం చేశారు’ అని శ్రీనివాసన్ చెప్పారు. క్రికెట్ అభివృద్ధి కోసమే తాను పని చేస్తానని, ఇందుకు ఐసీసీ సభ్యులందరి సహకారం కోరినట్లు ఆయన అన్నారు. టెస్టులు, వన్డేలు తర్వాత టి20 క్రికెట్‌కు కూడా తాను మద్దతు పలికినట్లు శ్రీని చెప్పారు. ‘టెస్టుల సమయంలో వన్డేలు అవసరమా అని, ఆ తర్వాత టి20లు ఎందుకు అని నేనూ భావించాను.
 
 కానీ టి20లు కొత్త ఆటగాళ్లను, అభిమానులను క్రికెట్ వైపు తీసుకొచ్చాయి’ అని ఐసీసీ బాస్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఐసీసీలో భారత్ ఆధిపత్యం 70-80 ఏళ్ల శ్రమకు ఫలితమన్నారు. టెస్టు క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన చెన్నైకి ఐపీఎల్‌లో జట్టు లేకపోతే ఒక క్రికెట్ అభిమానిగా తాను బాధపడేవాడినని, అందుకే సూపర్ కింగ్స్‌ను తీసుకున్నట్లు శ్రీనివాసన్ చెప్పారు. బీసీసీఐలో తాను శాశ్వతం కాదని, పదవీకాలం ముగిసిపోతే దానితో సంబంధం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

Leave a Comment