బ్రెజిలియా: ప్రపంచకప్‌లో పోర్చుగల్ ఎట్టకేలకు ఓ విజయం నమోదు చేసింది. కానీ, నాకౌట్ దశకు మాత్రం చేరుకోలేకపోయింది. గ్రూప్ ‘జి’లో భాగంగా గురువారం ఘనాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో గెలుపొందింది. గ్రూప్ నుంచి రెండో జట్టుగా నాకౌట్ బెర్తు సాధించే అవకాశం రెండు జట్లకూ ఉండడంతో ఆరంభం నుంచి హోరాహోరీ పోరాటం సాగింది.
అయితే 31వ నిమిషంలో ఘనా ఆటగాడు బోయె సెల్ఫ్‌గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యాన్నిచాడు. బంతిని అడ్డుకునేందుకు బోయె ప్రయత్నించగా.. అది అతని కాలికి తగిలి గోల్‌పోస్ట్ లోనికి వెళ్లింది. ఈ పొరపాటుకు ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. విరామ సమయం దాకా మరో గోల్ నమోదు కాకపోగా, ద్వితీయార్ధంలో 57వ నిమిషంలో అసమోహ్ గ్యాన్ (ఘనా) గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ దశలో మరో గోల్ చేస్తే మ్యాచ్‌లో గెలవడంతోపాటు నాకౌట్ చేరుకునే సువర్ణావకాశం ఘనా ముందుండగా… వారికి పోర్చుగల్ జట్టు ఆ అవకాశం ఇవ్వలేదు.
80వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో అద్భుత గోల్ సాధించి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మీదకు దూసుకువచ్చిన బంతిని ఘనా గోల్‌కీపర్ డౌడా చేతులతో వెనక్కి పంపగా, రొనాల్డో చాకచక్యంగా దాన్ని తిరిగి నెట్లోకి పంపించాడు.
ఆ తరువాత మరో గోల్‌కు ఘనాకు అవకాశం రాలేదు. దీంతో పోర్చుగల్ గెలుపు ఖాయమైంది. అమెరికాతో సమానంగా పోర్చుగల్ 4 పాయింట్లు సాధించినా.. గోల్స్ తేడాతో వెనకబడి ఉన్న కారణంగా గ్రూప్‌లో మూడో స్థానానికి పరిమితమై నాకౌట్ బెర్తును కోల్పోయింది. తమ తొలి మ్యాచ్‌లో జర్మనీలో చేతిలో చిత్తుగా (0-4తో) ఓడిపోవడం పోర్చుగల్ కొంపముంచింది.
Recent Comments