సెరెనాకు షాక్

Serena Williamsమూడో రౌండ్‌లోనే ఓటమి
 ప్రిక్వార్టర్స్‌లో నాదల్
 
 లండన్: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) 1-6, 6-3, 6-4తో సెరెనాను బోల్తా కొట్టించింది.  మరోవైపు వరుసగా మూడో మ్యాచ్‌లో తొలిసెట్ ఓటమి నుంచి తేరుకున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ టోర్నమెంట్‌లో తన జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండోసీడ్ నాదల్ 6-7 (4/7), 6-1, 6-1, 6-1తో మిఖైల్ కుక్‌ష్కిన్ (కజకిస్థాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ తొలిసెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండోసెట్‌లో 1-1 నుంచి నాలుగోసెట్‌లో 3-0 స్కోరు వరకు నాదల్ 15 గేమ్‌ల్లో 14 గెలిచాడు. నాలుగో సెట్‌లో స్కోరు 2-0 ఉన్నప్పుడు తొలి బ్రేక్ పాయింట్‌ను ఎదుర్కొన్నాడు. కుక్‌ష్కిన్ నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో చివరి మూడుసెట్లలో నాదల్ ఆధిపత్యమే కొనసాగింది. ఓవరాల్‌గా 12 అనవసర తప్పిదాలు చేసిన మాజీ చాంపియన్ 41 విన్నర్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ మూడోరౌండ్‌లో ఐదోసీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-0తో అలిసన్ రిస్కి (అమెరికా)పై నెగ్గింది. వర్షం కారణంగా శనివారం చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి.

Leave a Comment