వెనక్కి చూసుకుంటే…

61404583061_625x300గతాన్నెవరూ మరిచిపోకూడదంటారు. ఒక్కో విషయంలో అయితే గతం గతః అనాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా, నటి త్రిష మాత్రం గతం ఘనంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఇప్పడీమెకు ఇలాంటి భావన ఎందుకు కలిగిందంటారా? అనుభవాలు చెప్పిన పాఠాలేమో. త్రిష అందగత్తె. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె కన్నులు కవ్విస్తాయి. నవ్వులు కుర్రకారు నవనాడుల్ని జివ్వుమనిపిస్తాయి. దశాబ్దంపైగా దక్షిణాది సినీ ప్రియులను అలరిస్తున్న త్రిష నటిగా ఇప్పటికీ సంతృప్తి పొందలేదు. ఇది ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది.
 
 తమిళంలో కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, శింబు, విశాల్ వంటి స్టార్ హీరోలతోపాటు తెలుగులో టాప్ హీరోలందరితోను జతకట్టిన త్రిష ఇప్పటి వరకు తన నట జీవితాన్ని పునఃపరిశీలించుకున్నట్టున్నారు. తాజాగా ఈ బ్యూటీ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారట. వెంటనే మీరు పెళ్లి చేసుకోనున్నారా? అనే ప్రశ్నలు వేయకండి. ఆమెకింకా ఆ ఆలోచన రాలేదు. ఇంతకీ త్రిష తాజా నిర్ణయమేమిటంటే ఇకపై చెట్లు, పుట్టల వెంట తిరుగుతూ యువళ గీతాలుపాడటం, ప్రేమించు అంటూ హీరో వెంటపడటం, చిత్రం చివరి ఘట్టంలో గ్రూప్ ఫొటోకు పోజులివ్వడం వంటి పాత్రలు నటించదట.
 
 దీనిపై త్రిష మాట్లాడుతూ తాను నటిగా మారి పదేళ్లు దాటిందన్నారు. అయినా వెనక్కు తిరిగి చూసుకుంటే తనకు గొప్పతనాన్ని ఆపాదించి మంచి పాత్రలేమీ అమరలేదన్నారు. అందుకే ఇకపై తన గురించి చెప్పుకునేలాంటి పాత్రల్లో నటించాలని అలాంటి కథా పాత్రలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ  జయం రవి సరసన భూలోకం, అజిత్ సరసన మరో చిత్రంలో నటిస్తున్నారు. భూలోకం చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
 

Leave a Comment