నిశ్శబ్దాన్ని త్వరలోనే ఛేదిస్తా: పవన్ కల్యాణ్

pawan kalyanహైదరాబాద్ : తన పేరును దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. త్వరలోనే తాను నిశ్శబ్దాన్ని వీడుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించడానికే తానున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, అసలు రాజకీయాల గురించే ఏమీ మాట్లాడకపోవడంపై ప్రశ్నలు శరపరంపరగా వస్తుండటంతో పవర్ స్టార్ ఈ విషయం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అంటూ కొంతమంది తన పేరును దుర్వినియోగం చేసి విరాళాలు సేకరిస్తున్నారని, మరి కొంతమంది తాను నిశ్శబ్దంగా ఉన్నానని ప్రశ్నిస్తున్నారని, అయితే.. తన పార్టీకి గుర్తింపు రావడం కోసమే తాను ఊరుకుంటున్నానని పనవ్ చెప్పారు. జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు రాగానే తాను మీడియా ఎదుట తన నిశ్శబ్దాన్ని ఛేదిస్తానని తెలిపారు. అప్పుడే తమ పార్టీ భవిష్యత్ ప్రణాళికను కూడా వెల్లడిస్తానన్నారు. అప్పటివరకు తన పార్టీ పేరును, తన పేరును సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దుర్వినియోగం చేయొద్దని ఓ ప్రకటనలో పవన్ కోరారు.

నిధులు సేకరించాల్సిందిగా తాను ఎవరికీ చెప్పలేదని, ఎవరైనా తన పేరుమీద అలా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ చెప్పారు. మరోవైపు.. వెంకటేశ్తో కలిసి ఆయన నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Leave a Comment