అత్యాచారాలు ఆగడం లేదు!

uttar pradeshన్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించిన పలు ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. వాటిలో నాలుగు యూపీలోనే జరగడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో మరో మహిళ, బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా మృగాళ్ల లైంగిక దాడులకు బలయ్యారు. అత్యాచారాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు సాక్షిగా పార్టీలకు హితవు పలికిన మర్నాడే ఈ ఘటనలు వెలుగు చూడడం గమనార్హం.
 
 కారులోనే..: దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కదుల్తున్న కారులోనే 36 ఏళ్ల మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బస్టాప్‌లో బస్ కోసం ఎదురుచూస్తుండగా.. జితేంద్ర, జై భగవాన్ అనే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఆ మహిళను బలవంతంగా కార్లోకి ఎక్కించి, కార్లో ప్రయాణిస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అజయ్ అనే వారి మిత్రుడు కూడా వారితో కలిసి, తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
 
 యజమానే..: కర్నాటకలోని బెంగళూరులో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఆమె పనిచేస్తున్న కేబీ ఫౌండేషన్ కంపెనీ సీఈఓ శ్రీకాంత్, అతని సోదరుడు మదన్, మరో స్నేహితుడు గిరీశ్ కలిసి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ముఖ్యమైన ఆఫీస్ పనుందంటూ ఇంటికి పిలిపించి, ఈ దారుణానికి తెగించారు. దాంతో అవమానం భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
 
 అత్యాచార ప్రదేశ్
 
 ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఘాతుకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మీరట్, సీతాపూర్, వారణాసి, జలౌన్‌లలో మరో నాలుగు కేసులు వెలుగుచూశాయి. మీరట్‌లో ఓ దళిత యువతిని ఓ కామాంధుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీతాపూర్‌లో 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. వారణాసిలోని మందువాది ప్రాంతంలో మతిస్థిమితం లేని మహిళపై బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు అత్యాచారం జరిపారు. మొరాదాబాద్ జిల్లా రాజ్‌పురా గ్రామంలో ఓ 16 ఏళ్ల బాలిక చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. అయితే, ఆ బాలికది ఆత్మహత్యనా, లేక హత్యాచారానికి గురైందా? అన్న విషయం పోస్ట్‌మార్టం అనంతరమే తేలుతుందని పోలీసులు తెలిపారు.
 ఒకవైపు ఉత్తరప్రదేశ్ అత్యాచార ప్రదేశ్‌గా మారుతుండగా.. మరోవైపు రాష్ట్రంలో అంతా బావుందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ‘దేశంలో చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే యూపీలోనే శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంది. అందుకే పెట్టుబడిదారుల సదస్సుకు అంత మంది వచ్చారు’ అని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.
 
 ‘బదౌన్’పై సీబీఐ కేసు
 
 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ అత్యాచార ఘటనపై సీబీఐ గురువారం ఐదుగురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నేర పరిశోధన విభాగానికి చెందిన 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Leave a Comment