అధికార పీఠంపై ఐరన్ లేడీ

Anandibenఆనందీబెన్… గుజరాత్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితురాలు. ఆ రాష్ట్ర ప్రజలు ఆమెను ‘ఐరన్ లేడీ’ అని పిలుస్తారు. బాల్యం నుంచి ఎన్నో అవార్డులందుకున్న ఘనత ఆమెది.  ఆనందీబెన్‌కు రంగురంగుల చీరలంటే చాలా ఇష్టం. నుదుటి మీద ఎర్రటి బొట్టుతో హుందాగా కనిపించే ఆమెను చూస్తే ఎవరూ ఏడు పదులు నిండిన వ్యక్తి అనుకోరు. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించే చరిష్మా ఆమెలో లేదంటారు కొందరు.
కొద్దిగా పెడసరంగా ఉంటారని చెవులు కొరుక్కొనేవారూ లేకపోలేదు. ప్రభుత్వం తరపున గుజరాత్ రాష్ర్ట అభివృద్ధికి కృషి చేశారనే విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తారు. పటేల్ కుటుంబాలలో అందరికీ సహజంగా ఉండే సహనగుణం, పట్టిన పట్టు వదలని దృఢచిత్తం ఆనందీబెన్‌లో పుష్కలంగా ఉంది.

మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందీబెన్ పార్టీలో చేరిన నాలుగు సంవత్సరాలకు బిజెపి తర ఫున గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. మోడీ గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆమె రాజ్యసభ సభ్యులయ్యారు. విద్య, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. మోడీ ఆధ్వర్యంలో ఆమె బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవరకూ, వివిధ శాఖలలో పనిచేసి సత్తా చాటారు. ఆర్థిక, రోడ్లు – భవనాలు, ఉపద్రవాల నివారణ, పట్టణాభివృద్ధి శాఖ వంటి పలు శాఖలలో పనిచేశారు. ఏదైనా పని మోడీ ద్వారా జరగాలంటే, ఆనందీబెన్‌ను అడిగేవారంటే… ఆమె ఎంతటి ప్రాముఖ్యం సంతరించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
 పదహారు సంవత్సరాలు నిరంతరాయంగా మంత్రిగా చేసిన అనుభవం ఆమెది. బాల్యం నుంచి ఆనందీబెన్ పురుషాధిపత్యానికి వ్యతిరేకం.

ఆమె పాఠశాలలో చేరినప్పుడు ఆ క్లాసులో ఆమె ఒక్కతే ఆడపిల్ల. 1960లో కాలేజీలో చేరినప్పుడు కూడా ఆమె ఒక్కతే మహిళా విద్యార్థి. మోడీ సూచనల మేరకు ఆమె జిల్లాలలో విస్తృతంగా పర్యటించి, కలెక్టర్లను కలిసి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆమె మునుపటిలానే… భ్రూణ హత్యలు, స్త్రీ విద్య, రైతుల కష్టనష్టాల లాంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తారని గుజరాతీయుల ఆశ. మునుపటి ప్రభుత్వంలాగానే, తాను కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు, ఆర్థిక పురోగతికీ అనుకూలమనే ముద్రను వేసుకుంటూ, ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌కు… త్వరితగతిన పురోగమిస్తున్న రాష్ట్రమనే కీర్తికిరీటాన్ని నిలుపుతారని గుజరాతీయులు ఆశిస్తున్నారు.
 
నరేంద్రమోడీకి కుడి భుజం మాత్రమే కాదు ఎడమ భుజం కూడా ఆమే అంటారు  స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు, సర్దార్ సరోవర్‌లో దూకి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు ఆనందికి నవ్వడం తెలియదని చాలామంది అంటుంటే అందుకు ఆమె ‘ఒకరు పనిచేస్తున్నారా లేదా అన్నది వారి ముఖంలో ఉండే చిరునవ్వుని బట్టి కాదు, వారు చేసే పనిని బట్టి గుర్తించాలి’ అంటారు.  స్త్రీ సంక్షేమం కోసం మహిళా వికాస్ గృహ్‌లో చేరి, సుమారు 50 మంది వితంతువులకు వృత్తి విద్య నేర్పారు విద్యామంత్రిగా ఉన్న రోజుల్లో టీచర్‌ల బదిలీలలో లంచాన్ని పూర్తిగా నిరోధించారు. వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుచేశారు.

Leave a Comment