‘అమరావతి’ పేరుతో ఏపీ రాజధాని?

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విభాజిత అవశేష ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని నగరాన్ని విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్య నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే రాజధానికి స్థల నిర్ణయం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ నగరానికి ఏ పేరు పెడితే బాగుంటుందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక రాజధాని నగరానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ నగర్ లేదా ఎన్టీఆర్ కేపిటల్ సిటీ అని నామకరణం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండువేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు అద్దంపట్టే ‘అమరావతి’ అనే పేరు అయితే చారిత్రకంగా బాగుంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంగా ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తాజాగా అమరావతి పేరును రాజధానికి ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రాన్ని జారీ చేశారు. అలాగే గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఈ పేరువైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు మీద చాలా కాలనీలు ఉండడం చేత వాటితో పాటు రాజధాని నగరం పేరు కూడా కలిసిపోతుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మరి చివరిగా సింగపూర్ తరహా ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి ఏ పేరును ఖరారు చేస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Leave a Comment