అమరావతి ప్రస్థానంలో దేవస్థానం

మడమ తిప్పని అమరావతి ఉద్యమం కలియుగ దైవం పాదాల వద్ద పాదయాత్ర నైతిక విజయం సాధించింది…

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర

దగా పడిన అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నుండి తిరుమల వెంకటేశ్వరుని దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్ర అఖండ ప్రాంతాతీత ప్రజాదరణ సహితంగా బహిరంగసభతో విజయదుందుభి మోగించింది.

తిరుపతి మహా సభలో జనవాహిని

అడుగడుగునా ఆటంకాల దారిలో ప్రభుత్వ ప్రతికూలతలను ఎదుర్కొంటూ,.45 రోజులుగా పగిలిపోయిన పాదాలతో ఎండా వానా చలి తీవ్రతల్ని భరిస్తూ సాగిన నడక మొదటి గమ్యాన్ని చేరతామే కాక రాష్ట్ర ప్రజల మనసుల్ని కదిలించింది.

వ్యతిరేక మీడియా కూడా ఈ మహా పాదయాత్రని ప్రసారం చెయ్యకతప్పని పరిస్థితులు ఏర్పడి,.వైకాపా నేతలు ఈ యాత్రపై స్పందించాల్సి రావటమే అమరావతి రైతుల యాత్ర శక్తికి నిదర్శనం!

“ప్రభుత్వ తిరస్కరణ – న్యాయస్థాన సమర్ధన” తో మొదలైన ఈ ఏకైక రాజధాని సంకల్ప మహా పాదయాత్ర,.ముక్తాయింపుగా ఏర్పాటు చేసిన జనసభ కూడా మళ్ళీ “ప్రభుత్వ తిరస్కరణ – న్యాయస్థాన సమర్ధన” తోనే తిరుపతి పరిధిలోని దామినీడు వద్ద ఏర్పాటయ్యింది.

రాష్ట్రంలో ఈ సంఘర్షణ ఇంకెన్నాళ్ళు?

ఆన్నం పెట్టే ఎన్నో చేతులు కన్నీళ్లని తుడుచుకోవటానికి అలవాటు పడిపోయాయి. రెండేళ్లుగా రగులుతున్న రాజధాని రైతుల ఆవేదనకి ఈ విజయం సంతోషాన్ని ఇవ్వలేదు అనేది వాస్తవం!

ప్రతిపాదిత మహా రాజధాని నగరం అమరావతిలో
ఒకపక్క ఇప్పటికే సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఉన్నత న్యాయస్థానం క్రియాశీలకంగా కళకళలాడుతుంటే,.మరోపక్క శాశ్వత సచివాలయం, ఉన్నత న్యాయస్థానం,.ఉద్యోగులు, మంత్రులు, శాసనసభ్యులు, IAS ల నివాసభావనాలు వడివడిగా రూపురేఖలు తీసుకుంటున్నాయి.

చిత్రంలోని కట్టడాల పునాదులు పూర్తయ్యాయి

అమరావతి ప్రారంభమే ఒక ఆర్ధిక చైతన్యంతో అంతర్జాతీయ స్థాయికి ఎగసింది…

3 ఏళ్ల స్వల్పకాలంలో ఒక బ్రాండ్ విలువ ఏర్పడి, వాడుకలోకి వచ్చి కార్యాలయాలు తెరిచిన ఇలాంటి ఆధునిక నగర ప్రాజెక్ట్ భారతదేశంలో ఇంకొకటి లేదు ఇంకేప్పటికీ రాదు…ఇది నిర్ధారితసత్యం.

ఇది గ్రాఫిక్స్ కాదు

తాము అడగని రాజధాని ఇస్తామని ప్రభుత్వం వస్తే,.నమ్మి నేలతల్లిని వదులుకున్న రైతులు,.ఆ భూమిని ఎటూ కాకుండా చేసి అలానే వదిలేస్తామని ఇంకొక ప్రభుత్వం తమ పొలంలో కట్టిన శాసనసభనే వేదికగా చేసుకొని చేసిన ప్రకటనతో తల్లడిల్లిపోయారు.

నమ్మిన ప్రభుత్వం నడిమధ్య నాటిన వెన్నుపోటుని భరించలేక ఈ 730 రోజుల్లో 700 పైగా భూమిపుత్రుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి!

కాయకష్టం తెలిసిన ఆ పల్లెగుండెలు పంటిబిగువున భరిస్తూ పోరుబాట పట్టాయి.

తమ భూమితల్లిని గొడ్రాలుగా మారుస్తామంటే సహించేది లేదని ఎందరో తల్లులు ఉగ్రకాళీ అవతారాలెత్తారు. తమ ప్రమేయం లేని రాజకీయాల్లోకి, తమ జీవితాల్ని- తమ ప్రాంత భవిష్యత్తునీ లాగి,.అధికార యజ్ఞగుండంలో ఆహుతిస్తామంటే సహించేదిలేదని ఎలుగెత్తారు.

ప్రభుత్వం తన వ్యవస్థలన్నిటినీ రైతులమీద ప్రయోగించి వారి నిరసనల్ని కర్కశంగా అణచివేయటం మొదలుపెట్టింది.

గడపదాటని సాధారణ గృహిణులు, వృద్ధులపై నిర్దాక్షిణ్య బలప్రయోగపు దృశ్యాలు చూసి సామాన్యులు నిశ్చేష్టులయ్యారు.

గత ప్రభుత్వ పాలనలో అమరావతి నడిబొడ్డున కళ్లుతెరిచిన ఉన్నతన్యాయస్థానమే వాళ్ళకి ఈ ప్రపంచంలో మిగిలిన ఆధారమయ్యింది…

ఇది గ్రాఫిక్స్ కాదు

తానుగా పూనుకుని ఏమీ చేయలేని న్యాయదేవతని రైతులంతా కలిసి వేడుకోవటంతో న్యాయమూర్తులు కళ్లెదురుగా జరుగుతున్న వాస్తవాలని సమీక్షించే చారిత్రాత్మక బాధ్యతలని భుజాలకెత్తుకుని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యక్ష దైవాలుగా మన్ననలందుకుంటున్నారు.

ఒక ప్రభుత్వం చేసిన చట్టాలు, రాసిన పత్రాలు, ఇచ్చిన హామీలు, కుదుర్చుకున్న ప్రజా ఒప్పందాలు చెల్లవని చెత్తబుట్టలో వెయ్యటమంటే,.ప్రాధమికంగా ఇంక ఆ ప్రభుత్వం ఉనికి లేనట్లే లెక్క!

ఇలాంటి సన్నివేశాలు క్రమంగా స్వతంత్రభారత సాధన స్ఫూర్తిని, ప్రభుత్వం అనే వ్యవస్థపట్ల ప్రజల విశ్వాసాన్ని ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. తాము ఒక సుస్థిర వ్యవస్థలో లేమని ఆలోచించిన పౌర సమాజం క్రమంగా అశాంతికి, అస్థిరత్వానికి, అంతిమంగా అంతర్యుద్ధాలకి ఆలవాలమౌతుంది. పాలకులు ఎల్లప్పుడూ ఆ స్పృహతో అప్రమత్తంగా మెలగాల్సిందే.

కరోనకాలంలో చలించని కార్యదీక్ష

ఈ సంఘర్షణ రగులుతూండగానే 2020 కరోన మహమ్మారిని వెంటబెట్టుకుని వచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమం కనుమరుగయిపోతుందని వేసిన అంచనాలని నేలబారు చేస్తూ కొవిడ్ ఆంక్షల మధ్యే దీక్షా శిబిరాలలో హాజరవుతూ తమ స్థిరసంకల్పం స్థాయి ఏమిటో ప్రపంచానికి చాటారు,. అలా చాటే క్రమంలో ప్రాణాలు పోతున్నా ఎవరూ వెరవలేదు!

వాళ్ళే గనుక పెయిడ్ ఆర్టిస్ట్ లయితే, చుట్టూ కరోనతో వేలల్లో పాడెక్కుతున్న శవాలని చూస్తూ, ప్రాణాలపై తీపితో ఎప్పుడో ఉద్యమానికి మంగళం పాడేవారు మరి. రైతుబిడ్డల పిడికిలి బలహీనం అయినరోజున ఈ ప్రపంచం ఆకలిచావులతో అంతరిస్తుంది.

సమస్యకి పరిష్కారం చూపించాలని మనిషి ముందుగా కోరేది భగవంతుడినే,.ఆంధ్రులు ఆర్తిగా ఆరాధించే ఏడుకొండలవాడిని కాలినడకన చేరుకొని మొక్కాలని అమరావతి మహిళా రైతులు నడుంకట్టారు. ఆ కార్యంలో, తాము అందరూ ఒక సామాజికవర్గం కాదనీ, తమ జీవితాలు ఎప్పుడూ అరఎకరంపాటి ఆస్తి దాటలేదని సాటి ప్రజలకి చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుందని ఆ మధ్య & పేదతరగతి మహిళలు తలపోశారు.

కానీ, ఆ పాదయాత్రకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు!

షరామామూలే,.న్యాయస్థానం అనుమతించింది,. యాత్ర మొదలయ్యింది…

29 గ్రామాలు మాత్రమేనని ఇన్నాళ్ళు ఎగతాళికి చేయబడ్డ అమరావతి ఉద్యమం,.రాయలసీమ వాసుల ఎడతెగని అద్భుత ఆత్మీయ మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రంజక రాజధాని అమరావతి కోరిక ఎంత దృఢంగా ఉందో చాటిచెప్పింది.

అసలు
వైకాపా కంచుకోటలుగా ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధపడి వచ్చిన అమరావతి రైతులని,.సీమప్రజలు, నాయకులు, మహిళలు, విద్యార్ధులు అనే తేడా లేకుండా ఇలా ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న పరిస్థితి ఉందంటే,. రాజధాని రైతులు ఉత్తరాంధ్రకి మరో పాదయాత్ర చేపడితే అక్కడ ఎంత భ్రహ్మరధం పడతారో కదా అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు…

~విశ్వ~

Leave a Comment